హార్ట్ ఎటాక్ తో మరణిస్తే…”పోస్ట్ మార్టం” ఎలా చేస్తారో తెలుసా.? చేసే పరీక్షలు ఇవే..!
ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్‌లో గుండె పోటు (కార్డియాక్ అరెస్ట్) కారణంగా మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మృతదేహానికి వైద్యులు అనేక పరీక్షలు చేశారు. పోస్టుమార్టం కూడా నిర్వహించారు. దుబాయ్‌కు చెందిన ఫోరెన్సిక్ శాఖ ఈ పని నిర్వహించింది. అయితే సాధారణంగా ఒక్కో కారణం వల్ల చనిపోయిన వారికి ఒక్కో విధంగా పోస్టు మార్టం చేస్తారట. ఈ క్రమంలోనే గుండె పోటు వచ్చిన వారికి కూడా ఆ కోణంలో పోస్టు మార్టం చేస్తారని గల్ఫ్‌కు చెందిన ఓ డాక్టర్ వివరించారు.
గుండె పోటు కారణంగా చనిపోయారని భావిస్తే వారికి ముందుగా ఏమైనా గుండెకు సంబంధించిన రక్తనాళాల(వాస్క్యూలార్) సమస్య ఉందా లేదా అనే విషయం నిర్ధారిస్తారు. ఆ తర్వాత ధమనులు(ఆర్టరీస్) ఉబ్బి ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారు. అనంతరం రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టుకుపోవడం, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటి వాటిని కూడా గమనిస్తారు.
ఈ క్రమంలో అవి నిజమే అయితే ఆ వివరాలను వైద్యులు నమోదు చేసుకుంటారు. ఇక గుండె కవాటాలను కూడా అంతకు ముందే పరిశీలిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాతనే ముందు చెప్పిన విషయాలను నిర్దారించుకుంటారు.
ఒకవేళ ముందు నుంచి రక్తనాళాల సమస్య లేకున్నా, గుండె పోటు రాకున్న వైద్యులు అనుమానిస్తారు. ఈ క్రమంలో వారు మరికొన్ని కోణాల్లో పరీక్షలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఛాతిలో గట్టిగా గుద్దినా దాని వల్ల కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. లేదా ఎలక్ట్రిక్ షాక్ వల్ల కూడా గుండె సమస్య ఉత్పన్నం కావచ్చు.
దీంతో కార్డియాక్ ఫెయిల్యూర్ అవుతుంది. అయితే ఇవన్నీ బాహ్యంగా (బయట) జరిగే ప్రక్రియలు. ఇక ఇవే కాకుండా శరీరంలో అంతర్గతంగా చోటుచేసుకునే పరిణామాల వల్ల కూడా గుండె ఆగిపోయే అవకాశం ఉంది. అవేమిటంటే.. మన శరీరంలో ముఖ్యంగా ఉండాల్సిన ఎలక్ట్రోలైల్స్ ఇంబ్యాలెన్స్ అయినా, పొటాషియం, కాల్షియం స్థాయిలు తగ్గినా సమస్య వస్తుంది. దీంతో గుండె ఆగిపోవచ్చు.
అలాగే ప్రాణవాయువు(ఆక్సిజన్) తక్కువగా ఉన్నా, అది సరిగ్గా అందకపోయినా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఇక దీంతోపాటు శరీరం ఒత్తిడికి లోనుకావడం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఈ సందర్భాల్లో ఎప్పుడైనా గుండె కొట్టుకోవడం ఆగిపోయి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది..!