స్టార్ అవుతాడనుకుంటే ఛాన్స్‌లే కరువాయే
రచయితగా ఎన్నో సూపర్ హిట్స్‌ను అందుకున్న వక్కంతం వంశీ తాజాగా దర్శకుడిగా ‘నా పేరు సూర్య’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీకి ముందు ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్, కొరటాలలు రచయితలుగా చేసి దర్శకులుగా అయ్యారు. వారి దారిలోనే వక్కంతం వంశీ కూడా టాలీవుడ్ టాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడని, మంచి రచయితకు మంచి దర్శకుడిగా పేరు వస్తుందని అంతా భావించారు. వంశీ మొదటి సినిమాతోనే స్టార్ అవుతాడని, ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కట్టాల్సిందే అని అంతా భావించారు. కాని ఫలితం తారు మారు అయ్యింది.
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటూ ఒక తెలుగు సినిమాలో పాట ఉంది. ఆ పాటలో మాదిరిగా ఇప్పుడు వక్కంతం వంశీ పరిస్థితి ఉంది. దర్శకుడిగా నా పేరు సూర్యతో సక్సెస్ కొడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ పిలిచి మరీ అవకాశాలిస్తారని భావించాడు.
కాని బన్నీతో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది. రచయిత అయ్యి ఉండి మంచి కథను రాసుకోవడంలో వంశీ విఫలం అయ్యాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం ఏ హీరో కూడా ఆసక్తిగా లేడని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కంటే ముందు ఎన్టీఆర్‌తో వంశీ సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కంటే ముందు బన్నీతో సినిమా చేశాడు. ఒక వేళ నా పేరు సూర్య చిత్రం సక్సెస్ అయ్యి ఉంటే వంశీ రెండవ సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్‌తో అయ్యి ఉండేది.
ఆ తర్వాత రామ్ చరణ్‌తో కూడా వంశీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా రామ్ చరణ్ కూడా పిలిచి అవకాశం ఇచ్చేవాడని టాక్ వినిపిస్తుంది. వరుసగా అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమాలు చేస్తే స్టార్ దర్శకుడిగా నిలిచేవాడు. కెరీర్‌లో వెనుదిరిగి చూసుకునే అవసరం వచ్చేది కాదు.
ప్రస్తుతం పరిస్థితి అంతా తారు మారు అయ్యింది. అసలు ప్రస్తుతం ఈయన రెండవ సినిమా చేయగలడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్టార్ హీరోలు ఖచ్చితంగా ఈయన్ను నమ్మే పరిస్థితి లేదు. దాంతో ఈయన ఒక చిన్న హీరోతో సినిమా చేసి తన స్థాయి, ట్యాలెంట్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.
అలా నిరూపించుకుంటే వంశీకి అప్పుడు స్టార్ హీరోల నుండి పిలుపు వస్తుందేమో అంటూ సినీ వర్గాల వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈగోకు పోకుండా చిన్న హీరోలతో సినిమాలు చేస్తాడా లేదా పెద్ద హీరోలే కావాలని కెరీర్‌ను నాశనం చేసుకుంటాడో చూడాలి.