కనురెప్పల సమస్యలకు వాయుముద్ర
నేటి జీవనశైలి, పెరుగుతున్న కాలుష్య ప్రభావాల వల్ల గతంలో కంటే కంటి సమస్యలు ఎక్కువయ్యాయి. వీటిలో కనురెప్ప వాలిపోవటం, వణకటం వంటి సమస్యలు ముఖ్యమైనవి. ఏ తరహా కనురెప్ప సమస్యలకు వాయుముద్ర చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.
కనురెప్పలు వాలడం
కనురెప్పల నాడుల్లోని వాయువు ఎక్కడికక్కడ నిలిచిపోవటం వల్ల రెప్పలు సహజస్థితిని కోల్పోయి మాటిమాటికి మూతపడిపోతాయి . ఇంకొందరిలో కనురెప్పలు బిగుసుకుపోవడం,వాలిపోవడం, కుచించుకుపోవడం వంటి సమస్యలూ రావచ్చు.
కనురెప్పలు కొట్టుకోవటం
కొందరికి నిద్రాసమయంలో తప్ప మిగిలిన సమయం అంతా కనురెప్పలు ఆగకుండా కొట్టుకొంటూనే ఉంటాయి. కనురెప్పల నాడులు బలహీనపడటమే ఇందుకు ప్రధాన కారణం.
వాయుముద్ర చికిత్స
కనురెప్పలు సంబంధించిన పై రెండు సమస్యలకు వాయు ముద్ర సాధన చక్కని విరుగుడుగా పనిచేస్తుంది. దీన్ని సాధన చేసే వారు తూర్పు ముఖంగా పద్మాసనం లేదా సుఖాసనంలో వెన్ను నిటారుగా పెట్టి కూర్చోవాలి. చేతులు నిటారుగా చాచి మోకాళ్ళపై పెట్టుకోవాలి . ఇప్పుడు చూపుడు వేలును అరచేతిలోకి వంచి దాన్ని బొటన వ్రేలితో నొక్కి ఉంచాలి. మిగతా 3 వేళ్ళు పైకి నిటారుగా ఉంచాలి. దీనినే వాయుముద్ర అంటారు. ఈ ముద్రను 2 పూటలా భోజనానికి ముందు పావుగంట పాటు సాధన చేస్తే కనురెప్పల్లో స్తంభించిన వాయువు తొలగి కొద్ది రోజుల్లోనే కనురెప్పలు సహజంగా మారతాయి.