కృష్ణాష్టమి వేడుకను గుజరాతీ వారు ఎలా జరుపుకుంటారో తెలుసా?
గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభం అవుతాయి. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవారు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.
అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు.
వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్‌తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే (దహీహండీ) కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.