Politics

ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం ఏమిటో చూడండి

ఆంధ్రరాష్ట్ర సాధనకై అసువులు బాసిన అతి ముఖ్యమైన వ్యక్తి, నిష్కయోగి, స్వార్థరహిత దేశ భక్తుడు సర్వసంగపరిత్యాగి అయిన పొట్టి శ్రీరాములు! ఆంధ్రుల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన చిరస్మరణీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు.

పొట్టి గురవయ్య, మహాలక్ష్మి దంపతుల రెండవ సంతానంగా శ్రీరాములు 1901వ సంవత్సరంలో మార్చి 16వ తేదీన జన్మించారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆయన దృష్టి జాతీయోద్యమం వైపు మళ్ళింది. ముంబాయిలో విక్టోరియా టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుండి శానిటరీ ఇంజనీర్‌లో డిప్లొమా పొందిన ఆయన ‘గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులార్‌ రైల్వే’లో ఇంజనీర్‌గా బొంబాయిలో నాలుగేండ్లపాటు ఉద్యోగం చేశారు. ఇంజనీర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ‘సీతమ్మ’తో వివాహం జరిగింది. రెండుసంవత్సరాలలోపే పురుటి బిడ్డతో సహా భార్య మరణించటంతో జీవితంపై విరక్తిచెందిన శ్రీరాములు ఉద్యోగాన్ని వదిలేసి శాంతికాముకుడుగా పరిణవించే సమయంలో ‘జలియన్‌ వాలాబాగ్‌’ దురం తాలు ఆయనను కలవరపరిచాయి. ‘రౌలత్‌’ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమంతో శ్రీరాములు ప్రభావితుడై తన శేషజీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయద లచుకొని సబర్మతి ఆశ్రయం చేరుకొని గాంధీజీ అనుచరుడుగా మారారు.

గాంధీజీ పూరించిన స్వాతంత్య్రోద్యమ శంఖారావానికి ప్రభావితుడై గాంధీజీ ఆశ్రమంలోని పరివారంలో ప్రధాన సభ్యు డుగా, గాంధీ ఎంపిక చేసుకున్న కొద్దిమంది సర్వోదయ సేవకులలో అగ్రగణ్యుడుగా పద కొండు సంవత్సరాలు నియబద్ధ ఆశ్రమ జీవితం గడిపారు. సహాయ నిరాకరణోద్య మంలో, ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని కారాగార శిక్షలు కూడా అనుభవించారు. నిరుపమాన ‘సంఘసేవకుడు’. మురికి వాడల పారిశుద్ధ్యం, హరిజనుల ఆలయ ప్రవేశం, ఖాదీ పరిశ్రమ, పతితజనోద్ధరణ రంగాలలో ఆంధ్ర, గుజరాత్‌ ప్రాంతాలలో ప్రముఖ కార్యకర్తగా శ్రీరాములు చేసిన సంఘసేవ అపారమైనది.

హరిజనులకు ఆలయప్రవేశం మీద చట్టం తేవటానికి నిరాహార దీక్ష చేసి సంచలనం సృష్టించారు. నాటి మన ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సంవత్సరానికొక రోజు హరిజన దినోత్సవం గా యావద్భారతదేశమంతటా జరపాలనే, హరిజన సంక్షేమ నిధికై కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపు జరప గలమనీ ప్రకటించడంతో శ్రీరాములు దీక్ష విరమించారు. హిందూ సంఘసంస్కరణ నెలకొల్పి అస్పృశ్యతానివారణ, బాల్య వివా హ నిషేధం, వితంతు వివాహప్రోత్సాహం, మూఢాచార నిర్మూలనకు ఎంతో కృషి చేశారు.

సర్వోదయ నాయకులు స్వామి సీతారాం ఆంధ్రరాష్ట్ర నిర్మాణం కోసం ప్రాయోపవేశ దీక్షకు ఉపక్రమించి, కేంద్ర నాయకుల హామీలతో దీక్ష విరమించిన తరువాత ఎంతకాలానికీ రాష్ట్ర నిర్మాణం జరగక పోవటంతో ఆంధ్రులలో నిరాశా నిస్పృహలు అలుముకొన్న తరుణంలో శ్రీరాములు రంగప్రవేశం చేసి ఆంధ్ర రాష్ట్రా వతరణకై 1952 అక్టోబర్‌ 19న శ్రీబులుసు సాంబమూర్తి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీరాములు కఠోర నిరాహార దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించసాగింది. కండరా లన్నీ కరిగి, శరీరం శల్యమై, గుండెల్లో రక్త ఉత్పాదనా శక్తి ప్రతినిమిషం క్షీణిస్తూ ఒక్కొక్క అవయవం వశం తప్పుతుండ టంతో ఆయన ఆరోగ్య పరిస్థితికి యావ దాంధ్ర దేశం ఆందోళన చెంది ”ఆంధ్ర రాష్ట్రం ఇవ్వండి! శ్రీరాములు ప్రాణాలు కాపాడండి” అంటూ నినాదాలు చేశారు.

ప్రముఖ ఆంధ్ర నాయకులు దీక్ష విరమించ మని శ్రీరాములును కోరినా తన ఆత్మార్పణ తోనైనా ఆంధ్రరాష్ట్రం రావాలంటూ దీక్ష విరమించడానికి అంగీకరించలేదు. ఈ నిరాహార దీక్ష ఒక యజ్ఞంగా నిరంతరంగా 58 రోజులపాటు కొనసాగింది. డిసెంబర్‌ 15వ తేదీ రాత్రి 9.45 నిమిషాలకు స్మారకం కోల్పోయి, 11.23 ని||లకు శ్రీరాములు అమరుడయ్యారు. శ్రీరాములుగారి నిరుప మాన త్యాగ ఫలితంగా ఆయన మరణా నంతరం 1953 అక్టోబరు 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం నెలకొంది. ఆంధ్రరాష్ట్రావతారణతోనే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రేరణ లభించింది. ఫలితంగా 1956 నవంబరు 1వ తేదీన తెలంగాణా జిల్లాలను కలుపుకొని ‘ఆంధ్రప్రదేశ్‌’ అవతరించింది. కోట్లాది ఆంధ్రులు ‘ఆంధ్రప్రదేశ్‌’ రాష్ట్రంగా సంఘటిత మవటానికి, సమైక్య జీవనం గడపటానికి విశాలాంధ్ర ఆవిర్భావానికి మూల పురుషుడు మన పొట్టి శ్రీరాములు.