Devotional

దీపావళి జరుపుకోవడానికి ప్రధానమైన పురాణ కధనాలు ఏవి?

నరకాసుర వధ – ఆశ్వయుజ బహుళ పక్ష చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు సత్యభామ చేతిలో నరకాసురుని వధ జరిగింది. నరకాసురుని పీడ వదలాటంతో ఆనందపరవశులైన భూలోక వాసులు ఆ మిగిలిన రాత్రిభాగంలో, మరునాటి దినమున పండుగగా జరుపుకొన్నారు. ఆ రెండు రోజులు నరక చతుర్దశి, దీపావళి అమావాస్యలుగా ప్రసిద్ధి పొందాయి.

బలిచక్రవర్తిరాజ్య దానము – వామనావతారములో వచ్చిన శ్రీమహావిష్ణువు అడిగిన మూడు అడుగుల స్థలాన్ని ఇచ్చిన బలిచక్రవర్తి దానగుణానికి సంతోషించి విష్ణుమూర్తి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదించిన శుదినమిది.

శ్రీరాముడు సతీసమేతంగా రావణసంహార అనంతరము అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని భరత్ మిలాప్ లో పేర్కొనబడినది.

విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు కూడా ఈరోజే.

అయితే ధర్మసింధుతో సహా మిగిలిన గ్రంధములలో బలిచక్రవర్తికథ మాత్రమే వివరింపబడినది. మిగిలిన వృత్తాంతములు కధలు ఏ గ్రంధములోనూ ప్రస్తావించబడలేదు.