Politics

సోషల్ మీడియాలో సుహాసినిని ప్రత్యర్ధులు ఎలా దెబ్బతీస్తున్నారో తెలుసా?

రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. ఎదుటివారిలో లోపాలు ఎత్తి చూపుతూ తమ వాగ్దాటితో విమర్శలు గుప్పిస్తే, అదే స్థాయిలో ఆ విమర్శలను తిప్పికొట్టడం సహజం. కానీ హుందాతనంగా విమర్శలు,ప్రతి విమర్శల స్థానంలో వ్యక్తిగత విమర్శలు,బ్లాక్ మెయిలింగ్ లు పెరిగిపోయాయి. రాజకీయ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం వింటున్నా, చూస్తున్నా ఔరా అనిపిస్తోంది. ఇక ఎన్నికల్లో నిలబడ్డాక సాగే పోరు శృతి మించిపోతోంది. ఉచ్ఛనీచాలు మరిచి ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సిద్ధాంత పరమైన రాజకీయాలు పోయాయి.ఇక సోషల్ మీడియా వచ్చాక మరీ పెచ్చుమీరిపోయింది.

ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు,ఏమైనా తప్పుగా మాట్లాడితే ట్రోల్స్ కూడా వేస్తూ పోస్టులు పెట్టేస్తున్నారు.మంత్రి లోకేష్,ఎమ్మెల్యే అయిన నటుడు నందమూరి బాలకృష్ణ లకు సంబంధించి ఏ చిన్న అంశంలో తప్పు దొర్లినా వెంటనే ట్రోల్స్ పడిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో చిత్రాలు అలానే ఉన్నాయి.

ఎవరూ ఏ అస్త్రం వదలడం లేదు. టి ఆర్ ఎస్ ని ఓడించడానికి కాంగ్రెస్ సారధ్యంలో టిడిపి,టిజెఎస్,సిపిఐ పార్టీలు మహాకూటమిగా జతకట్టాయి. టిడిపికి వచ్చిన 14సీట్లలో కూకట్ పల్లి ఒకటి. ఆంద్ర ఓటర్లు ఎక్కువగా గల ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కి టికెట్ ఇవ్వడం ఆమె నామినేషన్ వేసి,ప్రచార పర్వంలోకి దూకింది.లోకేష్ విషయంలో ఏ తప్పునైతే పట్టుకుని సోషల్ మీడియాలో ఇరుకున పెడతారో అదే సూత్రాన్ని సుహాసిని విషయంలో వాడుతున్నారు.

మీడియాలో మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడడం, రాజకీయాలకు కొత్త కావడం వలన సరిగ్గా మాట్లాడలేకపోవడం వంటి వాటిని ఆసరా చేసుకుని ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు ఎలా పనికొస్తారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వేస్తున్నారు. పటాన్ చెరువులో ప్రచారం చేసిన చుండ్రు సుహాసిని అంటూ ట్విట్టర్ లో వైరల్ చేసి పారేసారు.

నియోజకవర్గం మీద ఆమెకు అవగానలేదు,లోకజ్ఞానం లేదు,ఇలా ప్రత్యర్ధులు ప్రచారం చేసేస్తున్నారు. కూకట్ పల్లిలో సుహాసిని గెలుపు సునాయాసమని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తిప్పికొట్టే విధంగా టిడిపి కూడా కసరత్తు చేస్తోందట. ఎందుకంటే తెలంగాణాలో మనుగడ కోసం టిడిపి విశ్వప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూకట్ పల్లిని గెలిపించుకుని తీరాలన్న పట్టుదలతో ఉంది.