Movies

ఇంతకీ విలేజ్ బేబీకి పాటలు ఎలా వచ్చాయో తెలుసా… ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

కూలీనాలి చేసుకుని జీవనం సాగించే పసల బేబీ ఇప్పుడు స్టార్ సింగర్ అయిపొయింది. పక్కింటి అమ్మాయి సరిగ్గా పాడకపోవడంతో ఎలా పాడాలో చూపిస్తూ పాడిన ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట ఆమె జీవితాన్నే మార్చేసింది. బేబీ పాడిన ఆపాటను పక్కింటి అమ్మాయి సెల్ ఓ చిత్రీకరించి,సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. చానల్స్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఇంటర్యూలు చేయడం, ఈ పల్లె గొంతు విని సెలబ్రిటీలు సైతం మురిసిపోవడం జరిగాయి. ఇన్నాళ్లూ పల్లెకు పరిమితమైన ఆమె గానం ఇప్పుడు పరిధులు దాటి పట్టణాలు, మహానగరాల్లో సెలబ్రిటీల చెవులను తాకింది. ఏరికోరి ఆమె చేత పాటలు పాడించుకుని మ్యూజిక్ డైరెక్టర్లు సైతం మురిసిపోతున్నారు.

ఇంతకీ ఈమెది తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామం. సేవా వెంకన్న ,దయాకరుణ దంపతులకు పుట్టింది. ఇంటికి పెద్దకూతురు,పైగా రెక్కాడితే గానే డొక్కాడని పరిస్థితి. చిన్నప్పటినుంచి కుటుంబ బాధ్యతలు కూడా స్వీకరించడం వలన చదువు ఊసేలేకుండా పోయింది. ఈమెకు ఇద్దరు తమ్ముళ్లు ,ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఇక అందరూ కూలి నాలీ చేసుకోవడం వలన ఎవరూ కూడా పెద్దగా చదువుకోలేదు.

కూలి పనులకు వెళ్ళేటప్పుడు అందరితో కల్సి సరదాగా జానపద గీతాలు పాడేది. అలా పాటలంటే ఆమెకు ప్రాణం అయింది.ఇక 13వ ఏటనే అమలాపురానికి చెందిన డ్రైవర్ పసల వజ్రారావు తో పెళ్లి అయింది. అమలాపురం వచ్చాక, భర్తకు చేదోడు వాదోడుగా ఉండడానికి బేబీ కూడా పొలం పనులకు వెళ్ళేది. ఈమెకు హిమబిందు,ప్రియబిందు అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరు కవలపిల్లలు. ఇద్దరికీ పెళ్లి చేసేసింది. అయితే బేబీ ఆరోగ్యం ఆమధ్య కొంచెం దెబ్బతినడంతో పొలం పనులు మానేసింది.

ఓ జిడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేసేది. అయితే ఆమె అమ్మమ్మ చక్కగా పాటలు పాడడం వలన, ఇంట్లో ప్రొఫెషనల్ సింగర్స్ లేకున్నా,బేబీకి ఆటోమేటిక్ గా పాటలు పాడడం అబ్బింది. అదే ఇప్పుడు జీవితాన్ని మార్చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆమె పేరు మారుమోగుతోంది.