Politics

వైసిపి గూటికి స్టార్ కమెడియన్ అలీ… ఈ వార్తలో నిజం ఎంత?

సినిమావాళ్లు రాజకీయాల్లో కొత్తకాదు. చాలామంది రాజకీయాల్లో రాణించారు. కొందరు మళ్ళీ వెనక్కి సినిమాల్లోకి వెళ్లిపోయారు కూడా. ఇక తాజాగా స్టార్ కమెడియన్ అలీ కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికి కారణం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో ఇటీవల భేటీ కావడం దీనికి బలాన్నిచ్చింది. ప్రస్తుతం ఏ పార్టీలో లేని అలీ ఓ పక్క సినిమాల్లో ,మరోపక్క టివి షోల్లో బిజీగా ఉంటూ పాదయాత్రలో ఉన్న జగన్ ని కలవడం వెనుక పెద్ద రహస్యమే ఉందని అంటున్నారు. జగన్ ఓ భేటీ కావడంతో వైసిపిలో చేరుతున్నారన్న కథనాలు వస్తున్నాయి.

నిజానికి అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లో మురళీమోహన్ రాజమండ్రి ఎంపీ సీటుకు పోటీ చేసినపుడు అలీ అసెంబ్లీ బరిలో ఉంటాడని టాక్ వినిపించినా అది నిజం కాదని తేలిపోయింది. మురళీ మోహన్ తో సాన్నిహిత్యంగా ఉండడం వలన ఈ టాక్ వచ్చింది. అయితే సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అలీ కి చాలా ఇష్టం. ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఈ మధ్య జగన్ ,పవన్ ల మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయి. అవి వ్యక్తిగత స్థాయిలో ఉండడంతో అందరూ చర్చించుకున్నారు.

ముఖ్యంగా పవన్ పెళ్లిళ్ల విషయాన్నీ జగన్ లేవనెత్తడంతో పవన్ అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుని ఓడించడానికి పవన్,జగన్ లు పొత్తు పెట్టుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీనిపై చర్చ నడుస్తుంటే, ఇక పవన్ తో కల్సి ప్రత్యేక హోదా పై పోరాడితే తప్పేమి ఉందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్య కలకలం రేపింది. జనసేన అధినేత దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తంచేయలేదు.

ఇక సినీ స్టార్ కమెడియన్ అలీ చాలా సేపు జగన్ పక్కన కూర్చుని చర్చలు జరపడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా ఎవరైనా సినీ నటులు వచ్చినపుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడే మాట్లాడేసి పంపించేసే, జగన్ తాజగా అలీ విషయంలో ఏకాంతంగా నవ్వుతూ చాలా సేపు మాట్లాడ్డం చూస్తుంటే, పెద్ద మతలబు ఉందని అంటున్నారు. అలీ వైసిపిలో చేరిక లాంఛనమేనని అంటున్నారు. ఈమేరకు కథనాలు వచ్చాయి. అలీతో మాట్లాడినపుడు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని, అందుచేత అలీ పార్టీలో చేరిక లాంఛనమేనని ఊహాగానాలు వస్తున్నాయి.

పైగా జగన్ ఆదేశిస్తే పోటీకి కూడా వెనుకాడనని అలీ క్లోజ్ సర్కిల్ దగ్గర ప్రకటించాడట. మరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తాడా, కడప జిల్లా నుంచి బరిలో ఉంటాడా అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక జగన్ పాదయాత్ర ముగింపు దశకు చేరడంతో జనవరి 9న ఇచ్ఛాపురంలో బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలోనే అలీ వైసిపిలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.