Politics

పార్లమెంట్ దగ్గర చిత్తూర్ ఎంపీ వేషాల వెనుక అసలు రహస్యం ఇదే

సినీ నటులు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తినా ఎక్కడో అక్కడ తమ అసలు నటనను ప్రదర్శించడానికి ఉత్సాహ పడుతుంటారు. ఇక చిత్తూరు టీడీపీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ విషయం తీసుకుంటే సినీ నిర్మాత గా పలు చిత్రాలు నిర్మించిన ఈయన నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అదే అనుభవంతో ఇప్పుడు పార్లమెంట్ దగ్గర కూడా నటిస్తున్నారు. గతంలో జై సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కానీ,ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సాగుతున్న ఉద్యమంలో గానీ డాక్టర్ శివప్రసాద్ రకరకాల వేషాలతో అలరిస్తూ, వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు .

టిడిపి ఎంపీలు ప్లే కార్డులతోనో,నినాదాలతోనో నిరసన తెలుపుతుంటే, డాక్టర్ శివప్రసాద్ మాత్రం రోజుకో వేషంతో రక్తి కట్టిస్తూ తన నిరసనను సాగిస్తున్నారు. సభలో జరిగే ఘటనకు సంబంధించి , ఆరోజు ఆ వేషం వేస్తూ విభిన్న రీతిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఎంపీగా కంటే, నిరసనల పేరిట ఈ వేష ధారణలతోనే ఎక్కువ గుర్తింపు పొందారు. ఈయన ఎలా వేషం వేయడం వెనుక ఆయన భార్య విజయలక్ష్మి ఉన్నారట.

అవును, పార్లమెంట్ సమావేశాల సందర్బంగా తన భర్త ఎలాంటి వేషం వేయాలి,ఎలాంటి మేకప్ అవసరం, ఆయా వేష ధారణ సమయంలో ఎలా మాట్లాడాలి, స్క్రిప్ట్ ఏంటి ఇలా అన్నీ కూడా విజయలక్ష్మి దగ్గరుండి చూసుకుంటారట. విజయలక్ష్మి వృత్తి విషయంలో గైనకాలజిస్ట్. కానీ భార్యగానే కాకుండా పూర్తిస్థాయిలో పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోయి, డాక్టర్ శివ ప్రసాద్ ని సదరు వేషంతో దగ్గరుండి మరీ రెడీ చేస్తారు.

ఫలానా వేషం వేయాలంటే,అందుకు సంబంధించి ఇంటర్ నెట్ లో గల విషయాలు,పాత్రలు తీరు తెలుసుకుని,పుస్తకాలు ఆమె విపులంగా చదివి,డాక్టర్ శివప్రసాద్ ని రెడీ చేస్తారట. వేషం కట్టించే ముందురోజు కూతుళ్లు మాధవీలత,నీలిమ సలహాలను తీసుకుంటారట.

అప్పుడే ఆ పాత్రకు తగ్గ దుస్తులు తేప్పించి,అందుకు అనుగుణంగా మేకర్ వేసి రెడీ చేస్తారు. ఇంతగా శ్రద్ధ తీసుకోవడం వలన డాక్టర్ శివప్రసాద్ విచిత్ర వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వేషం బాగుందా, సరిగ్గా సూటయిందా లేదా అనే విషయాలు గమనించి, ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకున్నాకే పార్లమెంట్ కి పంపుతారట.