రాజనాల చివరి దశలో దుర్భర జీవితం – ఎందుకో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినన్నాళ్ళూ పర్వాలేదు. ఆతర్వాత చిక్కులు వస్తాయి. ఎవరూ పట్టించుకోకపోవడం, పైసలు చేతిలో లేక నరకం చూడడం ఇలా ఎందరో నటులు చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారు. అందులో ప్రధానంగా అలనాటి మేటి విలన్ రాజనాల. అవును, రాజనాల కాళేశ్వర రావు నాయిడు సినిమాల్లో రాజనాల గా పాపులర్ అయ్యాడు. కొందరు కాళయ్య అని కూడా పిలిచేవారు. నటనకు,విలనిజాన్ని కొత్త భాష్యం చెప్పిన నటుడు రాజనాల 1925జనవరి 3న వెంకట నారాయణ, సుబ్బమ్మ దంపతులకు 9మంది సంతానంలో ఒకరుగా జన్మించారు.
భయానక,భీభత్సరసాలు పోషించడం,హీరోయిన్ ని వెంటాడి వేధించడం, హీరోని చివరి వరకూ ఎదుర్కోవడం వంటి సీన్ లలో రాజనాలను మించిన నటుడు లేరంటే అతిశయోక్తి కాదు. 1998మే21న తుదిశ్వాశ్వ విడిచిన రాజనాల చివరి దశలో దుర్భర జీవనం సాగించారు. రెవెన్యూ శాఖలో గుమస్తాగా పనిచేస్తూ 1944లో రంగస్థలంపై నాటకాలను ప్రదర్శించేవారు. ఆచార్య ఆత్రేయ రాసిన ఎన్నో నాటకాలను అయన ప్రదర్శించారు. కలెక్టర్ కూడా నాటకాలను తిలకించడానికి వచ్చేవారట.
ఇక నాటకాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చెప్పిన డైలాగులకు కోపంతో ఊగిపోతూ మూడు నెలలపాటు సస్పెండ్ చేశారట. ఆవిధంగా నటజీవితంలో తొలిదెబ్బ రుచి చూసారు. సినిమాల్లో ఆయన నటన అమోఘం. ఆరోజుల్లో రాజనాల వెండితెరమీద కనిపిస్తే చాలు మహిళా ప్రేక్షకులు శాపనార్ధాలు పెట్టేవారట. దీన్ని బట్టి విలనిజంలో ఈయన స్టైల్ ఎంతటి పాపులర్ అయ్యారో చెప్పక్కర్లేదు. దుష్ట నటచక్రవర్తి అని కొందరు ఈయనను కీర్తించేవారు.
రాజనాల నిజానికి విలాసవంతమైన కుటుంబం అయినప్పటికీ విలాసాలతో హారతి కర్పూరంలా ఆస్థి కరిగిపోయింది. ఇక ప్రేమించి పెళ్లాడిన భార్య 1969లో చనిపోవడం రాజనాలను కుంగ దీసింది.1984లో పెద్ద కొడుకు చనిపోగా, చిన్నకొడుకు అదృశ్యం అయ్యాడు. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేసిన రాజనాల జీవిత చరమాంకంలో ఆర్ధిక ఇబ్బందులతో నలిగిపోయారు. సినిమా జీవితంలో చెన్నైలో వైభవాన్ని చూసిన ఆయన ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో రెండో భార్య భూదేవితో కల్సి హైద్రాబాద్ అమీర్ పేట సారధి స్టూడియోస్ పక్క అపార్ట్ మెంట్ లో సింగిల్ బెడ్ రూమ్ లో తలదాచుకున్నారు.
ఆనాటి వైభవానికి తార్కాణంగా నిలిచే కార్లు,బంగ్లాలు కోల్పోయి,షుగర్ వ్యాధితో ఓ కాలుని కూడా పోగొట్టుకుని జీవితంపై ఆశలు వదులుకున్నారు. హైదరాబాద్ లో ఉండగా చిన్న చితకా వేషాలతో నెట్టుకొచ్చారు. భీమాంజనేయం సినిమా తీయాలని ఆయన తపించినా నెరవేర్చుకోలేదు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి నెంబర్ వన్ మూవీలో రాజనాల,నాగభూషణం లకు వేశాలిచ్చి గౌరవించారు. తెలుగువీర లేవరా షూటింగ్ కోసం అరకు వెళ్లిన రాజనాలకు షుగర్ ఎక్కువ కావడంతో ఓ కాలు తీసివేశారు.