భోగి పండుగ విశిష్టత ఏమిటో తెలుసా?
సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను చేసుకుంటారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.