Devotional

సంక్రాతి పండుగ విశిష్టత ఏమిటో తెలుసా?

సంక్రాతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఈ సంక్రాతి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు,కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు జరుపుకుంటారు.

ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు.ఇక సంక్రాతి రోజు హరిదాసు,గంగిరెద్దుల హడావిడి ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున దానాలు చేస్తే మంచిదని పుణ్యం వస్తుందని పండితులు చెప్పుతున్నారు.