జనవరి 26 రిపబ్లిక్ డే ఆ రోజే ఎందుకు… ఆ కథ ఏమిటి?
ఈరోజుల్లో స్వాతంత్య్రం ఎలా వచ్చిందో,రిపబ్లిక్ డే అంటే ఏమిటో , ఎందుకు జాతీయ పండగగా జరుపుకోవాలో ఏమీ తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడం తప్ప వివరం ఉండదు. అయితే జనవరి 26న రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నామో ఓసారి చూద్దాం. 1947ఆగస్టు 15న మనదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ మనకు కంటూ ప్రత్యేకంగా చట్టాలు,రాజ్యాంగం లేవు. అందుకే బ్రిటిష్ చట్టాలని పాటిస్తూనే, రాజ్యాంగం కోసం ఓ పరిషత్ ఏర్పాటుచేశారు. రాజ్యాంగ పరిషత్ కి 1946డిసెంబర్ 9న జరిగిన తొలి సమావేశంలో డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆతరవాత డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో న్యాయకోవిదుడైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యతను అప్పగించారు.
దాంతో రెండు సంవత్సరాల 11నెలల 18రోజుల అనంతరం రాజ్యాంగం రూపుదిద్దుకుంది. భారత దేశాన్ని సర్వసత్తాక,లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం రాజ్యంగా ప్రకటించేలా అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు అందించేలా,దేశసమగ్రత,సార్వభౌమత్వాన్ని కాపాడేవిధంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదం తెలిపినప్పటికీ, 1950జనవరి 26న ఉదయం 10 గంటల 18నిమిషాలనుంచి అమల్లోకి వచ్చింది. 395అధికరణలు,9షెడ్యూల్స్,22భాగాలతో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం తో,భారత దేశం నూతన గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ప్రపంచ రాజ్యాంగాలలో అతిపెద్ద రాజ్యాంగం మనదే.
రాజ్యాంగ ఏర్పాటులో ఎందరో మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించే చర్యలు చేపట్టారు. 1935ప్రభుత్వ చట్టం మన రాజ్యాంగానికి మూలాధారమని చెప్పాలి. అయితే ఇతర రాజ్యాంగాల నుంచి పలు అంశాలు స్వీకరించారు. బ్రిటన్ నుంచి ఇక పౌర సత్వం,పార్లమెంటరీ విధానం,స్పీకర్ పదవి, అలాగే అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, సుప్రీం కోర్టు,న్యాయ సమీక్షాధికారం తీసుకున్నారు. ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు,రాజ్య సభ సభ్యుల నియామకం,రాష్ట్రపతి ఎన్నిక, ఇక రష్యానుంచి ప్రాధమిక విధులు,కెనాడనుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ,జర్మనీ నుంచి అత్యవసర పరిస్థితి వంటి అంశాలు గ్రహించారు.
ఇలా ఎన్నో అంశాలు,విధానాలు ఎన్నో రాజ్యాంగాలనుంచి పరిశీలించి తీసుకుని అతి పెద్ద రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం పై ఉండే జాతీయ చిహ్నాన్ని యూపీలోని సారనాధ్ నుంచి అశోకుడు స్థాపించిన అశోక స్థంభం నుంచి స్వీకరించారు. అందులోని నాలుగు సింహాలు, గుర్రం ,ఎద్దులతో కూడిన అశోక చక్రం,సత్యమేవ జయతే అనే అక్షరాలను కల్పి 1950జనవరి 26న చిహ్నాన్ని రూపొందించారు.
తొలి రిపబ్లిక్ డే ఉత్సవాలు మూడురోజులపాటు సాగి 1950జనవరి 29న ముగిసాయి. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి జాతీయ పతాకం ఎగురవేసి,సైనిక వందన స్వీకారం కూడా ఒక సత్సంప్రదాయమే.
ఇక రిపబ్లిక్ డే నాడు ఒక ప్రముఖ దేశాధినేతను ఆహ్వానించి, సకల లాంఛనాలతో సత్కరించడం 1974నుంచి కొనసాగుతోంది. అలాగే ఆరోజు వివిధ రాష్ట్రాలలో గవర్నర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు. ఆపదల్లో ఉన్న వారిని రక్షించి ,సాహసం ప్రదర్శించే బాలలకు రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి చేతులమీదుగా సాహస బాలల అవార్డులు అందించేందుకు నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ ని ప్రవేశపెట్టి అందజేస్తోంది. దేశం,రాష్ట్రం,జిల్లా,గ్రామ పంచాయితీలనుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అవార్డు గ్రేహీతలను ఎంపిక చేస్తారు. అవార్డు గ్రహీతలంతా గణతంత్ర దినోత్సవం నాడు ఏనుగు అంబారీ ఎక్కి కవాతులో పాల్గొంటారు. సాహస బాలల అవార్డు పొందిన బాలబాలికలకు ఓ సర్టిఫికెట్,క్యాష్ అవార్డు అందజేస్తారు. అంతేకాకుండా వారి చదువుకోసం ఉపకార వేతనాలను,ఆర్ధిక సాయం కూడా ప్రభుత్వం అందజేస్తోంది.