‘రిపబ్లిక్ డే’ నాడు జరిగే వేడుకలు
ఏటేటా, ‘రిపబ్లిక్ డే’ నాడు భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో, రాష్ట్రపతి భవనం సమీపంలోని రైసినా హిల్స్ నుంచి, రాజ్‌పధ్ ద్వారా, ఇండియా గేట్ గుండా, ఎర్రకోట (రెడ్‌ఫోర్ట్) దాకా, ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. కాల్బల (ఇన్‌ఫెంటరీ) నౌకాదళ (నేవీ) వాయుసేన (ఎయిర్స్‌ఫోర్స్)ల, త్రివిధ సైనిక దళాలు, తమ తమ అధికారిక అలంకారాలతో, ఇందులో పాలుపంచుకుంటారు. దేశం నలుమూలల నుంచీ, పాఠశాలలో సమగ్ర శిక్షణపొందిన వరిష్ట ఎన్.సి.సి. కాడెట్స్‌కి చెందిన పటాలం కూడా, ఈ ఊరేగింపులో పాల్గొంటుంది. భారతీయ సైన్యాధిపతి (కమాండర్-ఇన్-ఛీఫ్) గా వ్యవహరించే భారత దేశాధ్యక్షులైన, ‘రాష్ట్రపతి’ ఈ సంరంభంలో, సకల అధికారిక లాంఛనాలతో సైనిక వందనం స్వీకరిస్తారు.
యూనిటీ ఇన్ డైవర్సిటీ’ -భిన్నత్వంలో ఏకత్వానికి, బహుముఖ సంకేతంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల, విభిన్న ప్రాంతాల, జానపద, నాగరిక కళాకారులతో, విశిష్టమైన సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఈ పెరేడ్‌లో చోటుచేసుకుంటాయి. అత్యంత వైభవోపేతమైన ఈ రిప్లబిక్ దినోత్సవ సంబరాలు, చివరికి భారతీయ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) జెట్స్, వినువీధులలో చేసే ‘ఫ్లైపాస్ట్’ తో ముగిసిపోతుంది.