టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల రధంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?
ఎన్నికలు దగ్గర పడ్తున్న వేళ ప్రచారానికి అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ పర్యటనలు సాగాల్సి రావడంతో అధునాతన ఎన్నికల రథాలను సిద్ధం చేసుకుంటున్నారు. అప్పట్లో పాత చెవర్లెట్ వాహనాన్ని ప్రచార రధంగా చేసుకుని ఎన్టీఆర్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేశారు. 1983ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో ఇక ఇదే వాహనం ఆయన ఉపయోగించేవారు. నందమూరి హరికృష్ణ ఈ వాహనాన్ని నడుపుతూ ప్రచార వాహన సారధిగా వ్యవహరించారు. గత ఎన్నికల ముందు బస్సు యాత్ర చేసిన చంద్రబాబు ఈసారి ప్రచార రథంపై సుడిగాలి పర్యటనకు సన్నద్ధం అవుతున్నారు.
గుంటూరులో గత 20ఏళ్లకు పైగా ప్రచార రథాల తయారీలో ఆరితేరిన జయలక్ష్మి మోటార్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సౌకర్యాలతో అందునా డిజిటల్ ప్రచార సౌకర్యంతో టిడిపి కోసం ఎన్నికల ప్రచార రథాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే తుదిమెరుగులు దిద్దుకున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్,ఎంపీ అభ్యర్థులకు ప్రచార రథాలు సిద్ధం చేసారు. జయలక్ష్మి మోటార్స్ డిజైనర్స్ అధినేత చౌదరి ఆధ్వర్యాన డిజైనర్ అట్లూరి ప్రసాద్ ఈ వాహనాలను తయారు చేసారు.
చంద్రబాబు కోసం భారీ ఐషర్ వాహనాన్ని ప్రచార రధంగా తీర్చిదిద్దారు. తొలిసారి ఎలక్ట్రానిక్ ఎల్ ఈ డి ప్రచార రధాన్ని చంద్రబాబు ఈ ఎన్నికల్లో వాడబోతున్నారు. ఇన్నాళ్లు చిన్న చిన్న వాహనాలనే ప్రచార రధంగా రూపొందించే ఈ సంస్థ తొలిసారి భారీ వాహనాన్ని ప్రచార రథంగా మలిచింది.
ముఖ్యంగా రోడ్డు షోలకు అనువుగా చంద్రబాబు కోసం సిద్ధం చేసిన ప్రచార రధంలో సిసి కెమెరాలు,లైవ్ కెమెరాలు,టిడిపి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించడానికి హై డెఫినిషన్ ఎల్ ఇడి వాల్ స్క్రీన్స్ , 10వేల మెగావాట్ల సౌండ్ బాక్స్ లు ,కార్డు లెస్ మైక్స్, బస్సులో సులువుగా ఎక్కడానికి రెండంచెల మెట్లు,ఇక బస్సులో అభ్యర్థితో పాటు 30మంది ఎక్కడానికి అనువుగా తీర్చిదిద్దారు.
అలాగే 25నుంచి 30మంది వాహన పై భాగంలో నిలబడడానికి కూడా వీలుంటుంది. అంత్యంత సామర్థ్యం గల జనరేటర్ కూడా ఏర్పాటుచేశారు. ఇరువైపులా నాలుగు అడుగుల వెడల్పు,మూడడుగుల ఎత్తుగల ఎల్ ఇడి స్క్రీన్స్ ఏర్పాటుచేశారు. ఇక నలువైపులా అత్యాధునిక సౌండ్ సిస్టం ఉంటుంది. భారీ ఎల్ ఇడి ఫ్లడ్ లైట్లను అమర్చారు. దీనివలన కిందనున్న వారికి పైనున్న వాళ్ళు క్లియర్ గా కనిపిస్తారు. బస్సు చుట్టూ టిడిపి ప్రభుత్వ అభివృద్ధి , సంక్షేమ పధకాల చిత్రాలను ముద్రించారు.