Politics

కెసిఆర్ తో జోడీ కడితే జగన్ కు ఒరిగేందేంటి?

దేశమంతా లోకసభకు ఆలాగే ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి మరో మూడు నెలల్లో జరుగనున్నాయి. దీంతో సహజంగానే ఆయా పార్టీల వ్యూహ్యాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మళ్ళీ అధికారం పొందాలని టీడీపీ,ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని వైస్సార్ సిపి గట్టి పట్టుదలగా ఉన్నాయి. ఎవరి అస్త్రాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వైస్సార్ సిపి అధినేత జగన్ ప్రజల సమస్యలు అవగతం చేస్తుకోడానికి ప్రజా సంకల్ప యాత్ర చేయగా, టిడిపి జన్మభూమి తదితర సభలతో జనం దగ్గరికి చేరింది. జనం కూడా తీర్పు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు.

ఇక ఈ తరుణంలో ఇటీవల ముందస్తు ఎన్నికలతో తెలంగాణాలో మళ్ళీ అధికారం చేపట్టిన టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్,టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జగన్ భేటీ కావడం సహజంగానే చర్చకు దారితీసింది. తెలంగాణాలో చంద్రబాబు వేలుపెడితే కాంగ్రెస్ పరిస్థితి తారుమారై, టిఆర్ ఎస్ కి ఎలా ప్లస్ గా మారిందో ఇప్పుడు జగన్ తో టిఆర్ ఎస్ నేతలు భేటీ వలన జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయిందని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వాదనను కొందరు కొట్టిపారేస్తున్నారు.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నాలు చేస్తూ కలిసినందున జగన్ కి కూడా జాతీయ స్థాయి ఆలోచనలు ఉన్నాయన్న పాజిటివ్ సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.కేసీఆర్ తో కలవడం వలన జగన్ ఒంటరి వాడు కాదన్న సంకేతాలు కూడా వెళ్లి జగన్ కి లాభమే చేకూరుతుందని,జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలు కూడా జగన్ వైపు చూడ్డానికి వీలవుతుందని అంటున్నారు. ఇక వైజాగ్ లో కేసీఆర్ చేసిన పర్యటన చూసాక కేసీఆర్ అంటే పెద్దగా ఆంధ్రాలో వ్యతిరేకత లేదన్న విషయం తేటతెల్లం అయిందని గుర్తుచేస్తున్నారు.

ఇక ఇప్పటివరకూ జగన్ కి ఒక పత్రిక , ఛానల్ వుంది. మరి ఇప్పుడు కేసీఆర్ రెండు తెలుగు చానల్స్ ని సొంతం చేసుకున్నారు. ఆ ఛానల్స్ లో కూడా జగన్ కి ప్రచారం కలిగి రాజకీయంగా లబ్ది చేకూరుస్తుందని విశ్లేషిస్తున్నారు. అయితే లాభమా,నష్టమా అనేది ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుని బట్టి తెలిసిపోతుంది.