Movies

బుల్లితెర స్టార్ మేఘన గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా?

శిశిరేఖ పరిణయం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ మేఘన కు బుల్లితెర శశి బిటెక్ అనే పేరుంది. ‘శశిరేఖ పరిణయంలో శశిలా ధైర్యంగా ఉండలేను. ఎవరైనా చిన్నమాట అన్నప్పటికీ కొన్ని వారాలపాటు బాధతో ఉంటాను. నేను చాలా సెన్సిటివ్ మైండ్ తో ఉంటాను. నిరాడంబరంగా ఉంటాను’అని చెప్పే మేఘన కన్నడ ప్రాంతం అందునా మైసూర్ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా స్పష్టంగా మాట్లాడగలదు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేఘన వ్యక్తిగత విషయాలతో పాటు బుల్లితెర ప్రయాణంపై తన అనుభవాలను ఇటీవల ఓ మీడియా సంస్థతో పంచుకుంటూ పలు విషయాలు వెల్లడించింది.

గవర్నమెంట్ ఇంజనీర్ లోకేష్ , లెక్చరర్ జయశ్రీ దంపతుల కుమార్తె అయిన మేఘనకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. అతడు చదువులో ముందుండేవాడు. ఇంట్లో అందరికన్నా చిన్నది కావడం వలన గారాబంగా పెరిగిన మేఘన పై చదువు వత్తిడి తేలేదట పేరెంట్స్. అయితే సంగీతం,నాట్యం మీద దృష్టి పెట్టాలని కోరేవారట. ఇదే విషయాన్నీ మేఘన చెబుతూ చిన్నప్పుడు నాగార్జున నటించిన గీతాంజలి మూవీ చూశానని, ఇక అదే నాగ్ కి చెందిన అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై తీసిన శశిరేఖా పరిణయం సీరియల్ లో నటించడం యాదృచ్చికంగా జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.

ఒకరోజు ప్రభు అనే వ్యక్తి కాల్ చేసి,మీ ప్రొఫైల్ ఫేస్ బుక్ లో చూశామని చెప్పాడు. మీరు స్టేజ్ ఆర్టిస్ట్ కదా,అన్నపూర్ణ స్టూడియో తీసే సీరియల్ కి ఆడిషన్స్ కి రండి అంటూ ఆహ్వానించారు. వచ్చి ఆడిషన్స్ లో పాల్గొన్నాను. అలా శశిరేఖ పరిణయం సీరియల్ హీరోయిన్ గా ఎంపికయ్యాను అని వివరించింది. మాయాబజార్ లోని సావిత్రి పాట చూసి ప్రాక్టీస్ చేసి రమ్మంటే,చూసి ప్రాక్టీస్ చేసి వెళ్లానని, కనీసం 5శాతం అయినా సావిత్రిలా చేయగలనా అనుకుని చేస్తే,అందరూ బాగుందని మెచ్చుకున్నారని మేఘన చెప్పుకొచ్చింది.

ఇక మూడునెలల్లో తెలుగు భాష కూడా వంటబట్టిందని పేర్కొంది. ఇక స్టేజ్ మీద అవార్డు కూడా దక్కిందని, స్వయంగా అమల,నాగార్జున అభినందనలు తెల్పడం నిజంగా మర్చిపోలేనిదని చెప్పింది. ఇక డూప్ లేకుండా బైక్ నడపడం, 20అడుగుల ఎత్తునుంచి చెరువులోకి దూకడం వంటివి ఏమాత్రం భయం లేకుండా చేశానని మేఘన గుర్తుచేసుకుంది. అయితే చెరువులో దూకినపుడు పక్కనే పెద్దబండరాయి కూడా ఉందని దానిమీద పడివుంటే ఇక అంతేసంగతులని చెప్పింది.

ఉదయం ఎప్పుడో షూటింగ్ కి వెళ్లి రాత్రి 9గంటల దాకా ఉండడం వలన వ్యక్తిగత జీవితం కోల్పోతున్నామన్న బాధ వస్తుందని, అసహనానికి గురవుతానని చెప్పింది. అయితే ఈ సీరియల్ వల్లే కదా ఇంతమంది ఆదరాభిమానాలు దక్కుతున్నాయని అనిపించి మాములుగా అయిపోతానని చెప్పింది. నెలకు 15రోజులు షూటింగ్ లో ఉంటానని, శని ఆదివారాల్లో మైసూర్ లో వాలిపోయి, కుటుంబంతో ఆనందంగా గడిపేస్తానని చలాకీగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.