ఎన్టీఆర్ సంపాదనతో హైదరాబాద్ లో ఎన్ని ఆస్తులు కొన్నారో తెలుసా?
ఆరోజుల్లో డబ్బుకి విలువ ఎక్కువగా ఉండేది. రేట్లు స్వల్పంగా ఉండేవని అంటారు. అందుకే అప్పట్లో కూడబెట్టిన ఆస్తులు ఎవరికైనా ఉంటె అవి కోట్లకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఇక సినిమా వాళ్ళు అయితే పొలాలు, స్ధలాలు కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తారు. అందులో కటిక పేదరికం ఎలా ఉంటుందో చవిచూసిన ఎన్టీఆర్ అయితే తన సంపాదనతో బాగానే ఆస్తులు కూడబెట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే హైదరాబాద్ లో ఆస్తులు కొనడం మొదలెట్టిన ఎన్టీఆర్ ఇక హైదరాబాద్ వచ్చాక లెక్కకు మించి కొన్నారు. నిజానికి రాయలసీమ దుర్భిక్ష నివారణకు నిధి సేకరణ నాటినుంచి ఆనాటి సీఎం కాసు బ్రహ్మానంద రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడడంతో హైదరాబాద్ లో స్థిరపడే కార్యాచరణ మొదలైంది.
బ్రహ్మానంద రెడ్డి ప్రోత్సాహంతో అబిడ్స్ లో ప్రస్తుతం గల ఎన్టీఆర్ ఎస్టేట్స్ ఎన్టీఆర్ కొన్నారు. ఇప్పుడు రామకృష్ణ 70ఎం ఎం థియేటర్ గల ప్రాంతం అప్పట్లో పురాతన పాఠశాల భవనం కావడంతో దాన్ని పడగొట్టడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులుండేవి. అయితే శిథిలావస్థకు చేరిన ఈ భవనాన్ని కూలగొట్టేలా ఉత్తర్వులు పొందిమరీ దాని స్థానంలో 70ఎం ఎం థియేటర్ ని మోజుపడి కట్టారు. అక్కడ ఎన్టీఆర్ ప్రతిమ అందరినీ ఆకర్షిస్తుంది. ఆతర్వాత పక్కనున్న స్థలాలు కూడా కొనుగోలు చేసి ఎన్టీఆర్ ఎస్టేట్స్ గా మార్చారు.
వ్యాపార వినోద కేంద్రంగా అభివృద్ధి చేసారు. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు,రామకృష్ణ జంట థియేటర్లు, హరికృష్ణ వాటాగా వచ్చిన ఆహ్వానం హోటల్ ఇవన్నీ ఎన్టీఆర్ ఎస్టేట్ గా ఉంటూ అభిమానులకు దర్శనీయ స్థలంగా మారింది. నిజానికి రాష్ట్రంలో ప్రతిచోటా ఒక థియేటర్ కట్టాలని ఎన్టీఆర్ ఆనాడు భావించారట. కానీ అది ఎందుకో వర్కవుట్ కాలేదు, దాంతో హైదరాబాద్ లోనే మిగిలిన చోట్ల ఆస్తుల కొనుగోలు సాగించారు. ఆయన సీఎం అయ్యేవరకూ కూడా ఆస్తుల కొనుగోలు సాగింది.
రామకృష్ణ స్టూడియోస్,తారకరామా థియేటర్ స్థలం, ముసాబ్ ట్యాంక్ లో నిర్మించిన ఐదు స్వతంత్ర భవనాల సముదాయం ఇలా సినిమా డబ్బుతో కొనేశారు. ఐదు భవనాల కాంప్లెక్స్ లోనే కొడుకులు ఉంటున్నారు. చివరిగా కాపురమున్న బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 13లోని భవనం చిన్న కూతురు ఉమామహేశ్వరి కోసం కొన్నారు. అయితే ఆతర్వాత లక్ష్మి పార్వతి కి బదలాయించారు. అయితే దీనిపక్కన గల స్థలాన్ని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కొన్నారు.
గండిపేట కుటీరం కూడా అప్పుడే కొన్నారు. 1989లో ఆయన నాచారానికి మకాం మార్చారు. మళ్ళీ అబిడ్స్ కి వచ్చారు. అయితే కష్టార్జితం కొన్న ఆస్తులన్నీ విలువలు పెరిగి కోట్లకు చేరడంతో కొన్ని ఆస్తులు కూడా ప్రత్యర్థుల ఆగ్రహానికి గురయ్యాయి. ఆస్తుల కొనుగోలు కూడా వివాదం అయింది. అయితే ఆతర్వాత ఆ వివాదాలన్నీ ఉత్తిదేనని తేలిపోయింది.