నటుడు రంగనాథ్ గురించి వెలుగులోకి రాని అరుదైన సంఘటనలు
సినీ రంగంలో హీరో అవుదామని వచ్చి కొన్ని సినిమాల్లో హీరో వేషం తో టాప్ రేపినప్పటికీ మారిన పరిస్థితుల్లో విలన్ గా ,కేరక్టర్ ఆర్టిస్టుగా సరిపెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నటుడు రంగనాధ్ ఒకరు. పాపం ఈయన సూసైడ్ చేసుకుని చనిపోయి,అందరినీ విషాదంలో ముంచెత్తారు. చూడముచ్చటైన రూపం,గంభీరమైన కంఠస్వరం ఈయన సొంతం. అయితే ఈయన గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవు. రంగనాధ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాధ్. వీళ్ల ఫామిలీ చాలా పెద్దది. వీళ్ళ పూర్వికులది ఒంగోలు. ఆయన తండ్రి రైల్వే గార్డు గా చేసారు. తాతగారు పార్ధసారధి మైసూరు ప్యాలస్ లో ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవారు.
మూడు తరాల కథానాయకులతో దాదాపు 250సినిమాల్లో నటించిన రంగనాధ్ 50సినిమాల్లో విలన్ గా చేసారు. తొలిరోజుల్లో హీరోగా జమీందారు గారమ్మాయి,అమెరికా అమ్మాయి వంటి చిత్రాలతో హిట్ అందుకున్నారు. రంగనాధ్ బాల్యం అంతాకూడా తాత గారి దగ్గరే గడిచింది. తాత కూచిగా పిలవబడే రంగనాధ్ కి మైసూర్లోనే తాపీ ధర్మారావు తో పరిచయం,ఆయన రచనలపై ఆసక్తి ఏర్పడ్డాయి.
ఇక రంగనాధ్ కి రవీంద్ర నాధ్,దేవేంద్రనాధ్,జయచంద్ర నాధ్,గజేంద్రనాధ్ లతో పాటు స్వర్ణ అనే ఓ సోదరి ఉండేవారు. ఇక రంగనాధ్ తల్లికి సినిమాల్లో నటించాలని ఉవ్విళ్ళూరేవారు. దాంతో కొడుకుకు రంగనాధ్ ని హీరోగా చూడాలని ఆమె తపించారు. రంగనాద్ సోదరుడు రవీంద్రనాధ్ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. ఇక రంగనాధ్ రాజమండ్రిలో రైల్వే టికెట్ కలెక్టర్ గా పనిచేసే సమయంలో సినిమాల్లో నటించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు.
దీంతో బాపు డైరెక్షన్ లో బుద్ధిమంతుడు సినిమాలో ఓ పాటలో ఫ్లూట్ వాయించే వ్యక్తిగా నటించాడు. ఇక నటుడు గిరిబాబు దృష్టిలో పడడంతో చందన మూవీతో హీరోగా రంగనాధ్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా అయితే పెద్దగా ఆడలేదు గానీ వెండితెరకు కొత్తహీరో వచ్చాడని అందరూ అనుకున్నారు. విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇక హీరో కృష్ణంరాజు ఇదే సమయంలో రంగనాధ్ కి గాడ్ ఫాదర్ గా వ్యవహరించారు.
సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో జమీందారు గారి అమ్మాయి మూవీతో పెద్ద హిట్ అందుకున్న రంగనాధ్ ఆతర్వాత అమెరికా అమ్మాయి మూవీలో నటనతో అందరిని మెప్పించాడు.కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి కూడా అవ్వడం, కుటుంబ భారం మీద పడడం వంటి కారణాల నేపథ్యంలో సోదరులను బాగా చదివించి ప్రయోజకుల్ని చేసారు.
నవత బ్యానర్ పై ఇంటింటి రామాయణం,పంతులమ్మ మూవీస్ సక్సెస్ సాధించాయి. నిర్మాత ఎం ఎస్ రెడ్డి కూడా బాగా ఛాన్స్ లు ఇచ్చారు. అయితే ఆతర్వాత హీరోగా ఛాన్స్ లు రాకపోవడంతో విలన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నాడు. భార్య అంటే ఎంతో ప్రాణంగా భావించేవారు. ఆమె బాల్కనీలోంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో నాలుగేళ్లు మంచానికే పరిమితమైన ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు.
ఆమె మరణంతో వైరాగ్యంలో మునిగిన రంగనాధ్ ఒకసారి రైలు కింద తలపెట్టి చనిపోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఓ ఇంటర్యూలో చెప్పారు. అతడి సూసైడ్ ఆలోచనలు తప్పించడానికి ఆయన కూతురు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. 2015డిసెంబర్ 19న ఉరిపోసుకుని, తన మొదటి సినిమాలో డైలాగ్ నే రాసి పెట్టి మరీ కన్నుమూశారు.