నేటి వారసులే…రేపటి కథానాయకులా….?
సినిమాల్లో రాణించాలంటే బాక్ గ్రౌండ్ ఉండి తీరాలని అంటారు. ఎందుకంటే చాలామంది హీరోలకు బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇందులో స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి మినహా ఆందరూ బ్యాక్ గ్రౌండ్ పుష్కలంగా ఉన్నవాళ్లే. సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం దీనికి బ్రేక్ పడింది. కొత్తవాళ్లు వచ్చి తమ సత్తా చూపిస్తూ దుమ్ము రేపుతున్నారు. ఇక ప్రస్తుతం హీరోల కొడుకులే రేపటి హీరోలవుతారా అనే ప్రశ్న వస్తోంది. ఇన్నాళ్లూ వీళ్ళను మోసామని , రేపటి తరం వాళ్ళను కూడా మోయాలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం హీరోలుగా ఉన్నవాళ్ళంతా వారి వారసులను తెరమీదికి తెస్తున్నారు. వన్ నేనొక్కడినే మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదే ఫ్యామిలీలో సుధీర్ బాబు కొడుకు కూడా సినిమాలంటే ఇంట్రెస్ చూపుతున్నాడట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రిటైర్ అవ్వకుండానే రాజకీయాల్లో అడుగుపెట్టి దూసుకెళ్తున్నారు. పవన్ వారసుడిగా అకిరా నందన్ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.
భవిష్యత్తులో పవర్ స్టార్ అవుతాడని అంటున్నారు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఈ ఏడాది ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు మాస్ మహారాజా రవితేజా కుమారుడు రాజా ది గ్రేట్ మూవీలో నటించి మెప్పించాడు. ఇక బన్నీ కొడుకు అయితే బన్నీ సినిమా ఫంక్షన్స్ లో సందడి చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడుకు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా హీరోల కుమారుల హల్ చల్ చూస్తూనే రేపటి హీరోలెనని వినిపిస్తోంది. ఇందులో ఎవరు నిలబడతారో ఎవరు వెనక్కి పోతారో అప్పుడే చెప్పలేం.