రెమ్యునరేషన్ పేరిట భారీగా కొట్టేస్తున్న స్టార్ హీరోయిన్లు
తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు. రోజకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఉండటం అంటే మాటలు కాదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సరిగ్గా లెక్కపెడితే అరడజను మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యునరేషన్స్ మాత్రం ఆకాశాన్ని తాకేస్తున్నాయి. తెలుగులో ఇప్పుడు మన హీరోయిన్లు కొందరు హీరోలతో సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మన ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ లాగేస్తున్నారు.
రెమ్యునరేషన్ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో అనుష్క ఉంది. వయసు 35 దాటినా కూడా ఇప్పటికీ అనుష్క అంటే అదే ఇమేజ్ కొనసాగుతోంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో పనిలేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వరకు అందుకుంటుందట. ఇప్పుడు నటిస్తున్న కోన వెంకట్ సినిమాకు కూడా భారీగానే తీసుకుంటున్నట్లు టాక్.
ఇక నయనతార కూడా ఒక్కో సినిమాకు రెండున్నర నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట, చిరంజీవి హీరోగా వస్తున్న సైరా కోసం 3 కోట్ల వరకు నయనతారకు ముట్టజెప్పారట. అంతెందుకు అక్కినేని సమంత కూడా రెమ్యునరేషన్ విషయంలో దుమ్ము రేపిస్తోంది. పెళ్లైన తర్వాత కూడా సమంతతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈమె ఒక్కో సినిమాకు 2 నుంచి 2.5 కోట్ల వరకు తీసుకుంటోంది. సినిమాను బట్టి ఈమె రేట్ కూడా ఫిక్స్ చేస్తుందట. ఇప్పుడు నాగచైతన్యతో నటిస్తున్న మజిలీ సినిమాకు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇక ఈమె తర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మరో బ్యూటీ పూజా హెగ్డే. డిజే తర్వాత ఈమె జాతకం మారిపోయింది.ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోయినా పూజాతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం మహర్షితో పాటు ప్రభాస్ సినిమాలో నటిస్తున్న పూజా.. సినిమాకు దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వరకు అందుకుంటుంది. కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కొనసాగిస్తుంది. సినిమాకు కోటిన్నర వరకు చార్జ్ చేస్తుంది చందమామ. తమన్నా ఎఫ్2 విజయం తర్వాత సినిమాకు కోటి 20 లక్షలు డిమాండ్ చేస్తోందట. కైరా అద్వానీ, రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాకు కోటి వరకు తీసుకుంటున్నారు. ఇక సాయి పల్లవి సైతం ‘పడిపడి లేచే మనసు’ సినిమా కోసం కోటి 20 లక్షలు పుచ్చుకుంది.