30 రోజుల్లోనే ఎన్నికలు ఏ పార్టీ ఎంత సన్నద్ధంగా ఉంది?
ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో వస్తుందని భావిస్తున్న తరుణంలో ఆదివారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసింది. ఎవరూ ఊహించని విధంగా షెడ్యూల్ ప్రకటించి,కోడ్ అమల్లోకి వచ్చేలా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అన్ని పార్టీలకు షాకిచ్చిందని అంటున్నారు. ఏపీలో ఎన్నికల కోసం అధికార టిడిపి,విపక్ష వైసిపి,జనసేన పార్టీలు తమదైన శైలిలో ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా వచ్చింది. మొత్తం 30రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసేలా షెడ్యూల్ ఉంది. పైగా దేశంలో ఏడు దశల్లో పోలింగ్ కోసం నిర్ణయం తీసుకుంటే అందులో తొలిదశ అంటే ఏప్రియల్ 11న ఎపి లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఇన్నాళ్లూ పడిన కష్టానికి ఫలితం ఈ నెల్లాళ్ళలోనే తేలిపోనుంది. ఇక రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సన్నద్ధంగానే ఉన్నాయా,లేదా అసలు ఏ పార్టీ నిజంగా సిద్ధంగా ఉందొ అనే విషయాల్లోకి వెళదాం. కేవలం 30రోజుల్లో ఎన్నికల తతంగం పూర్తి అవుతోంది. దీన్ని బట్టి అభ్యర్థుల ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉందని చెప్పవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపికలో సీఎం చంద్రబాబు ముందుచూపుతోనే ఉన్నారని చెప్పాలి.
పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమీక్ష చేసేసి,దాదాపు 60శాతం అభ్యర్థులను రెడీగా ఉంచేశారు. అధికారికంగా ప్రకటన లేకున్నా ఆఖరి నిమిషంలో బిఫార్మ్ ఇచ్చేస్తారు. ఇక ఐదేళ్లుగా అధికారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పూర్తి భిన్నంగా ఉన్నా, ఎన్నికలకు చాలారోజుల నుంచి సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల టిడిపి కి అభ్యర్థుల కొరత ఉంటె,వైసిపి తీవ్ర పోటీ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం జగన్ కి కత్తిమీద సామే అవుతుందని అంటున్నారు.
అయితే లోక్ సభ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వలసల కారణంగా ఎంపీ టికెట్స్ కొంచెం కష్టంగా మారిందని అంటున్నారు. ఇక జనసేన పార్టీ పరిస్థితి చూస్తే,ఈ పార్టీ పరిస్థితి ఒక రకంగా దారుణంగానే కనిపిస్తోంది. మొదటి సారి ఎన్నికల బరిలోకి వెళ్తున్నందున అసలు ఎవరికీ అర్ధం కాకుండా కొంత గందరగోళం నెలకొందన్న మాట వినిపిస్తోంది. అనుభవం లేని నాయకత్వం,క్షేత్ర స్థాయిలో కేడర్ లేకపోవడం, అభ్యర్థులకు కొదవలేదని పైకి చెప్పినంత ఈజీగా అక్కడి పరిస్థితి లేకపోవడం వంటి ఇబ్బందులు ఆపార్టీని వెన్నంటుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే చాలా స్థానాలకు అసలు అప్లికేషన్స్ రాలేదట. ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదని అంటున్నారు. మార్చి 25లోగా నామినేషన్స్ వేయడానికి సమయం ఉన్నందున పేరున్న వ్యక్తులు జనసేన గూటికి వస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతెందుకు పవన్ ఎక్కడ నుంచి బరిలో దిగుతారో కూడా ఫైనల్ కాలేదు. ఒకటా రెండా ఎన్ని చోట్ల నుంచి పవన్ పోటీ చేస్తారో అనే విషయం కొలిక్కి రాలేదు. టీడీపీ,వైసిపి లతో పోలిస్తే, అనుభవం,సామర్ధ్యం జనసేనలో తక్కువగానే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.