రచ్చ గెలిచి ఇంట గెలవటానికి సిద్దమైన శ్రీలక్ష్మి మేనకోడలు….. ఏమిటా కథ…?
ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె ఎస్ రామారావు తాజాగా కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా(క్రికెటర్ ట్యాగ్ లైన్ తో)తలపెట్టారు. ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి రూరల్ బొమ్మూరు కాటన్ గెస్ట్ హౌస్ లో బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. విజయవంతమైన చిత్రాల దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో తీస్తున్న ఈ సినిమాకు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టగా, అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ సందర్బంగా డైరెక్టర్ భీమినేని మాట్లాడుతూ ఇప్పటికే 46చిత్రాలు తీసిన కె ఎస్ రామారావు బ్యానర్ లో 47వ చిత్రంగా తాను చేయడం ఆనందంగా ఉందన్నారు.
తండ్రీ కూతుళ్ళ చక్కని అనుబంధం, గ్రామీణ నేపధ్యంగా సాగే ఈ చిత్రం వినోదాత్మకంగా, ఎమోషన్, సెంటిమెంట్, హాస్యం మేళవించి ఉంటుందని వివరించారు. గతంలో జంధ్యాల దర్శకత్వంలో హీరో గా నటించిన రాజేష్ కుమార్తె ఐశ్వర్య రాజేష్ తమిళంలో కొన్ని చిత్రాల్లో చేసి ఇప్పుడు తెలుగులోకి వచ్చి, ఇందులో హీరోయిన్ గా వేస్తోందని,కార్తీక్ రాజ్ హీరోగా చేస్తున్నాడని చెప్పారు. కేజే ఎఫ్ సినిమాకి మాటలు రాసిన హనుమాన్ చౌదరి ఈ సినిమాకు సంభాషణలు అందిస్తుండగా, ఆండ్రూ బాబు ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ కాగలదని తెలిపారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇందులో తండ్రి పాత్ర చేస్తున్నారని తెలిపారు
నిర్మాత కె ఎస్ రామారావు మాట్లాడుతూ అరుణ్ రాజ్ కుమార్ రాజ్ అందించిన కథ ఆధారంగా తమిళంలో తీసిన సినిమా హిట్ అయిందని, బాగా నచ్చడం వలన తెలుగులో తీస్తున్నామని, ఈ చిత్రం షూటింగ్ 100శాతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే తీస్తామని వివరించారు. కౌసల్య కృష్ణమూర్తి (క్రికెటర్) గా టైటిల్ పెట్టామని,ఇందులో హీరోయిన్ క్రికెటర్ గా ఉంటుందని చెప్పారు. ఏప్రియల్ 11న సినిమా పూర్తిచేసి,మే 23నాటికీ విడుదల చేయాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ తమిళంలో వచ్చిన ఈ సినిమా టీజర్ ని చూపించిన వెంటనే తెలుగులో తీయడానికి కె ఎస్ రామారావు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకున్నానని చెప్పారు. నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ ఇందులో పోలీసాఫీసర్ పాత్ర వేస్తున్నానని, ఇంతమంచి సినిమాలో కేరక్టర్ ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. హీరో కార్తీక్ రాజ్ మాట్లాడుతూ తనను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సక్సెస్ ఫుల్ గా చేస్తానన్నారు.
హనుమాన్ చౌదరి మాట్లాడుతూ రైతు, క్రికెటర్ వంటి భిన్నమైన పాత్రలతో తండ్రి కూతుళ్ళ మంచి అనుబంధం గల ఈ చిత్రానికి మాటలు రాసే ఛాన్స్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఆండ్రూ బాబు మాట్లాడుతూ తమిళంలో ఇప్పటికే ఈ చిత్రం వచ్చినందున దాన్ని మించి ఫొటోగ్రఫీ అందించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పీఆర్వో బిఎ రాజు తదితరులు పాల్గొన్నారు.