మోహన్ బాబు జీవిత చరిత్ర….మీకు తెలియని ఎన్నో నిజాలు
విలన్ గా ఎంట్రీ ఇచ్చి ,హీరోగా రాణించి,నిర్మాతగా సినిమాలు నిర్మించి,రాజకీయ నాయకుడిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి, శ్రీ విద్యానికేతన్ పేరుతొ విద్యాసంస్థను నిర్వరిస్తున్న విలక్షణ నటుడు,డైలాగ్ కింగ్,కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబు అంటే తెలియని వారుండరు. ఏ పాత్ర వేసినా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటించి,మెప్పించడంలో దిట్ట. క్రమశిక్షణ ఈయన ఎదుగుదలకు ప్రధాన కారణం. ఈయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. సినీ ఇండస్ట్రీలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ఈయనకు గురువు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈయనకు అత్యంత సన్నిహితుడు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 1952 మార్చి 19న జన్మించిన మోహన్ బాబు కి రంగనాధ్ చౌదరి, రామచంద్ర చౌదరి , కృష్ణ అనే ముగ్గురు తమ్ముళ్ళతో పాటు విజయ అనే సోదరి ఉన్నారు. తండ్రి టీచర్ గా చేసారు. ఇక మోహన్ బాబుకి విష్ణు, మనోజ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి అనే కూతురు ఉన్నారు.కొడుకులిద్దరూ సినిమాల్లో హీరోలుగా వేస్తూ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఇక కూతురు కూడా సినిమాల్లో నటిస్తూ కొన్ని టివి కార్యక్రమాల్లో జడ్జిగా, నిర్వాహకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఏర్పేడు , తిరుపతిలలో చదివి,చెన్నైలో ఫిజిక్స్ లో డిగ్రీ చేసిన మోహన్ బాబు కొంతకాలం వ్యాయమ ఉపాధ్యాయునిగా పనిచేసారు. సినిమాల్లో దర్శకత్వ విభాగంలో ఐదేళ్లు పనిచేసిన మోహన్ బాబు కి తన గురువు డాక్టర్ దాసరి డైరెక్షన్ లో వచ్చిన స్వర్గం నరకం మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఆవిధంగా చాలా సినిమాల్లో పలు పాత్రలు వేసి, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి హీరోగా మారారు.
లక్ష్మి ప్రసన్న బ్యానర్ నెలకొల్పి సొంతంగా 50కి పైగా సినిమాలు నిర్మించారు.520సినిమాల్లో నటించారు. ఇందులో 150సినిమాల్లో హీరోగా చేసారు. పెదరాయుడు వంటి సందేశాత్మక చిత్రాలు,అల్లరి మొగుడు,అల్లుడు గారు వంటి కమర్షియల్ చిత్రాలలో హీరోగా మోహన్ బాబు నటన ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించడంతో కలెక్షన్ కింగ్ అయ్యారు.చిత్తూరు జిల్లా రంగంపేటలో శ్రీ విద్యానికేతన్ సంస్థను స్థాపించడం ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసిన మోహన్ బాబు ఇప్పటికీ ఇండస్ట్రీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సినీ జీవితంలో ,నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు గల మోహన్ బాబు అన్నింటినీ అధిగమించి ఉన్నతస్థాయికి ఎదిగారు. మహానటుడు ఎన్టీఆర్ తో మేజర్ చంద్రకాంత్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తీశారు. 2015నాటికి సినిమా రంగంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు పూర్తికావడంతో వేడుక జరిపి కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
ఈయనకు నట ప్రపూర్ణ, డైలాగ్ కింగ్,కలెక్షన్ కింగ్ అనే బిరుదులూ ఉన్నాయి. లండన్ సంఘం వాళ్ళు ప్రెస్టీజియస్ అవార్డు అందించారు. ఇక కళారంగంలో , విద్యారంగంలో మోహన్ బాబు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించడంతో 2007లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.