Movies

కమెడియన్ సప్తగిరి సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలుసా? బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగులో హాస్య నటుడిగా పలుచిత్రాలు చేసి,ఆతర్వాత హీరోగా మారిన సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. చిత్తూరు జిల్లా, పుంగనూరు కి చెందిన ఓ సామాన్య కుటుంబంలో రెండవ సంతానంగా జన్మించాడు. ఇతని తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. తల్లి గృహిణి. ఇంటర్ వరకు చదివాడు. అయితే ఎంసెట్ లో మంచి ర్యాంకు రానందున బిటెక్ చేసే ఛాన్స్ కోల్పోయాడు. ఇక సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఒక రోజు తిరుమల వెళ్ళాడు.

దర్శనం అయ్యాక అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి కొంచెం పక్కకు జరుగు అనడంతో ఈ పేరేదో బాగుందే అనుకుని తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించి, డిసెంబరు 2016 లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా హీరోగా మారాడు.

నిజానికి ఇంటర్ చదివేటప్పుడే సినిమాలు చూడ్డం బాగా అలవాటు కావడంతో,సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని నిశితంగా పరిశీలించేవాడు. దాంతో క్రమంగా సినీ రంగం వైపు ఆసక్తి కలిగింది. స్టడీస్ సమయంలో క్రికెట్ అంటే మక్కువ కావడంతో క్రికె ట్లో రాణిస్తూ పలు టోర్నమెంట్ లలో పాల్గొని కప్ లు అందుకున్నాడు. ఇక హైదరాబాదుకు వెళ్ళి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు. అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెబితే ఎలా వెళ్తావ్,ఎక్కడుంటావ్ అని పేరెంట్స్ అడిగారట.

మొత్తానికి హైదరాబాదు చేరుకొని, తన మిత్రుని ఇంట ఉన్నాడు. ఇంగ్లీషులో పరిజ్ఞానం పెంచుకుందామని ఎస్. ఆర్. నగర్ లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. కానీ రెండు నెలలు గడిచాక అందులో పురోభివృద్ధి లేకపోవడంతో వదిలేశాడు. సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ ఆరునెలలు తిరిగాడు.

అయితే రమేష్ వర్మ అనే పబ్లిసిటీ డిజైనర్ తన ఇంటి ముందే ఉండడంతో అక్కడికి దిల్ రాజు లాంటి సినిమావాళ్లు వచ్చేవారు. దీంతో ఒకరోజు రమేష్ వర్మ దగ్గరకు వెళ్లి తాను సహాయ దర్శకుడిగా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. చాలా రోజులు తిరిగాడు. చివరకు రమేష్ వర్మ తరుణ్ తో ఒక వూరిలో అనే సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమా మూడు మాసాల తర్వాత ఆగిపోవడంతో రమేష్ వర్మ ఇతన్ని శేఖర్ సూరి దగ్గర చేరమన్నాడు. అతని దగ్గర చాలా రోజులు తిరిగాక చివరకు శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఎ ఫిల్మ్ బై అరవింద్ కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు.

ఈ సినిమాలో పనిచేయడం ద్వారా సప్తగిరి సినిమా లోని అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు.ఇక ఆ తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. ఆవిధంగా బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా సప్తగిరి తెరపై కనిపించాడు.ఇందులో మంచి పేరు వచ్చింది. తర్వాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో సప్తగిరి హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ పరుగు మూవీలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు.

మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా ఛాన్స్ కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో కమెడియన్ గా ఆడియన్స్ ని మెప్పించడంతో ఛాన్స్ లు పెరిగాయి. దేశముదురు,సాధ్యం,కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. దర్శకుడు మారుతి తీస్తున్న ప్రేమకథా చిత్రమ్ లో కూడా ఛాన్స్ ఇచ్చాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో హీరోగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు.

అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమా నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. హీరోగా మొదటి సినిమా కావడంతో ఓ మోస్తరుగా ఆడింది . ఆతర్వాత సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాలో చేయగా కొంతవరకే ఆడింది. లవర్స్, దృశ్యం, మనం, టెంపర్, దోచేయ్, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను, రారండోయ్ వేడుక చూద్దాం, తదితర చిత్రాల్లో నటించాడు.