లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ రివ్యూ…. హిట్టా….ఫట్టా….??
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి వివాదమే. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని వర్మ తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలు.. లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబం దూరమైన విధానం.. చంద్రబాబు నాయుడు చేసిన మోసం.. ఇవే ప్రధాన కథాంశాలుగా చేసుకుని వర్మ ఈ సినిమాను తీశారు. ‘వెన్నపోటు’ అనే ఆయుధంతో ఈ సినిమాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు.
ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఓ వర్గం సినిమాను ఎలాగైనా అడ్డుకోవాలని భావించింది. మరో వర్గం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. సినిమాను అడ్డుకోవాలని భావించిన వర్గంలో అత్యధిక శాతం టీడీపీ భక్తులే. ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఈరోజు (మార్చి 29న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. సినిమాను విడుదల చేయడానికి వీళ్లేదంటూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మకు హిట్టు ఇస్తుందే లేదో చూడాలి.
ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమా బాగుందని, ఇలాంటి కథను ధైర్యంగా తెరకెక్కించిన వర్మ గట్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేమని కొనియాడుతున్నారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా అద్భుతంగా తీశారట. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ కలిసి ఉండే సన్నివేశాల్లో కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతమని అంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ సినిమాలో వినలేదట. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని కొనియాడుతున్నారు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ చక్కగా కుదిరారని కూడా ప్రశంసిస్తున్నారు.
అయితే, ఫస్టాఫ్‌లో లక్ష్మీ పార్వతి డబ్బా బాగా ఎక్కువైందనే వాదన కూడా వినబడుతోంది. ఫస్టాఫ్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి సన్నివేశాలు తప్ప ఏమీ లేదట. పరమ బోరింగ్ అని కొంత మంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు సన్నివేశాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదని టాక్. కాకపోతే ఆయనలోని కన్నింగ్ను మాత్రం ఓ రేంజ్లో చూపించారట వర్మ. మొత్తానికి వర్మ మరోసారి నిరాశపరిచారని అంటున్నారు. ఇలా, ట్వట్టర్లోనూ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది సూపర్ అంటుంటే.. మరికొందరు ఏం బాగాలేదు అంటున్నారు. తొలి రోజు పూర్తయితే కానీ సినిమా పరిస్థితి ఏంటో తెలీదు!