వయస్సు మీద పడుతున్నా వన్నె తగ్గని స్టార్ హీరోయిన్స్
అది తెలుగు అయినా, హిందీ అయినా,మరో భాషకు చెందిన చిత్రపరిశ్రమ అయినా విచిత్రంగా ఉంటుంది. ఇమేజ్, పాపులారిటీ వంటివి తగ్గిపోతే నెగ్గుకు రావడం కష్టమే. ఈ రంగుల ప్రపంచంలో హీరోయిన్ల కంటే హీరోలకు చాలా కాలం లైఫ్ ఉంటుంది. స్టార్ హీరోలైతే ఏకంగా 40 ఏళ్లుగా నటిస్తున్నా ఇప్పటికీ హీరోలుగానే కొనసాగుతుంటారు. అయితే వారి సరసన నటించే హీరోయిన్లకు రెండు మూడు ఏళ్లకే వారి కెరీర్ క్లోజ్ అవుతుంది. ఇక చేసేది లేక సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి దాదాపుగా దశాబ్దకాలం దాటినప్పటికీ తమ హవా కొనసాగిస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తున్నారు.
అందులో ముఖ్యంగా అనుష్కకు తెలుగు, తమిళ భాషలలో ఉన్న క్రేజే వేరు. 2005 లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’ చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి న స్వీటీ ఆ తరువాత ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ‘అరుంధతి’ సినిమా తన కెరీర్ లోనే మైలురాయిగా నిల్చింది. ఇక ‘బాహుబలి’ తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ సుమారు యాభై చిత్రాల్లో నటించి ప్రస్తుతం కొంత విరామం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తన ఇమేజ్‌కు తగిన పాత్రలు అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేయడానికి ఎక్కువ శ్రద్ద చూపుతోంది.
ఇక లేడీ సూపర్ స్టార్ గా పిలువబడే నయనతార కు అందం కంటే కూడా అభినయం ఎక్కువ. దక్షిణాది నటీమణుల్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటి ఎవరంటే అది ఖచ్చితంగా నయన్ అని చెప్పాలి. 2003 లో మలయాళీ చిత్రం ద్వారా ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి, తెలుగు తెరకు ‘లక్ష్మి’ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 70 సినిమాలలో మెప్పించిన నయన్ ప్రస్తుతం చిరు సరసన ‘సైరా’ సినిమాలో చేస్తోంది. ఇక అవార్డులు కూడా బానే అందుకుంది.
త్రిష చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి దాదాపుగా రెండు దశాబ్దాలవుతు న్నప్పటికీ ప్రతీ సంవత్సరం ఆమె క్రేజ్ పెరగడమే తప్ప తగ్గేది లేదు అని నిరూపిస్తుంది. 2003 లో తరుణ్ కు జోడిగా ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రభాస్ కు జోడిగా నటించిన ‘వర్షం’ తో బ్రేక్ అందుకుంది. అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గత మూడు సంవత్సరాలుగా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. తన రీసెంట్ సినిమాలు ’96’ , ‘పేట’ విజయం సాధించాయి. ప్రస్తుతం మరో నాలుగు తమిళ సినిమాలతో బిజీగా కొనసాగుతోంది.
‘ఇష్టం’ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించింది శ్రియ, వయసు పెరిగినా తరగని అందం ఏమాత్రం తరగలేదు. తెలుగులో ‘సంతోషం’, ‘ఠాగూర్’, ‘మనం’.. వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన కెరీర్ లో ఉన్నాయి. దాదాపుగా 70 చిత్రాలలో మెప్పించిన ఈమె . హీరోయిన్ గా వచ్చి 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. వివాహం తరువాత కూడా సినిమాలను కొనసాగిస్తోంది.
ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నటించిన తమన్నా 2005లో హిందీలో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాతో మొదలుపెట్టింది. అదే సంవత్సరం మంచు మనోజ్ సరసన ‘శ్రీ’ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదట గ్లామరస్ హీరోయిన్ గా పేరుగాంచిన తమన్నా తరువాత బాహుబలి, అభినేత్రి చిత్రాలలో తన అభినయానికి మంచి మార్కు లు కొట్టేసింది. ‘ఎఫ్ 2’ విజయాన్ని ఎంజాయ్ చేస్తు న్న ఈమె జోరు హైలెవెల్ లో ఉందనడానికి చిరుతో ‘సైరా’లో నటించడమే కారణం. ఇక బాలీవుడ్ క్విన్ రీమేక్ ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’లో నటిస్తుంది.
ఇక ‘మగధీర’కి ముందు కాజల్ వేరు ఇప్పటి కాజల్ వేరు. ఆ సినిమా క్రేజ్ అలాంటింది . దాంతో కాజల్ కు వరుస ఆఫర్లు వచ్చాయి. నవదీప్, రామ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి.. ఇలా దాదాపుగా అందరి హీరోల సరసన మెప్పించింది. . రామ్ చరణ్ తో ‘మగధీర’లో నటిస్తే.. చిరుతో ‘ఖైదీ నెం 150’లో మెప్పించింది. మెగాస్టార్ ఫ్యామిలీలో తండ్రి /కొడుకుతో నటించిన ఘనత ఆమెదే. తాజాగా 50 సినిమాలు పూర్తిచేసుకున్న కాజల్ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలు అవుతున్నా ఛాన్స్ లు తగ్గలేదు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాలలో చేస్తోంది.
రామ్ తో ‘దేవదాసు’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై న గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు అత్యధిక పారితోషకం తీసుకున్న నటి. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోన్న ఈమె తెలుగులో చాలా సంవత్సరాల విరామం తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటించింది. ఇక హన్సిక బాలనటిగా చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ నటించి, 2007 లో అల్లు అర్జున్ తో ‘దేశముదురు’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కంటే తమిళ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది హన్సిక ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తోంది.