E.V.V.సత్యనారాయణ జీవితంలో జరిగిన ఈ ఆసక్తికమైన విషయాలు తెలుసా?
జంధ్యాల అనగానే తెలుగు తెరకు వినూత్న శైలిలో కామెడిని పరిచయం చేసిన విషయం గుర్తొస్తుంది. ఇక ఆయన దగ్గర శిష్యరికం చేసి హాస్యానికి సరికొత్త అర్దాన్ని ఇ.వి.వి. సత్యనారాయణ ఇచ్చారు. కామెడీనే ప్రధానంగా తీసుకుని ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను ఎప్పటికీ కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాయి. ఇవివి పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా, కోరుమామిడి లో సాధారణ వ్యవసాయ కుటుంబంలో వెంకటరావు, వెంకటరత్నం దంపతులకు 1956 జూన్ 10 న జన్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో మద్రాస్ బయలుదేరి సినిమా ఛాన్స్ లకోసం చాలా ప్రయత్నం చేశారు.
అలా మొదటిగా అగ్ర దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి తరువాత స్క్రీన్ రైటర్ గా, డైరక్టర్ గా, నిర్మాతగా, ఇలా అంచెలంచెలుగా ఎదిగిన మన ఇవివి గుండెపోటు కారణంగా అకస్మాత్తుగా మరణించారు. అయితే ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.జంధ్యాల దగ్గర 8 ఏళ్ళు 22 సినిమాలకు ఈవీవీ సహాయదర్శకుడిగా పనిచేశారు. రాజేంద్రప్రసాద్ నటించిన ‘చెవిలో పువ్వు’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు ఇవివి. అయితే మొదటిసినిమా ‘చెవిలో పువ్వు’తో ఫెయిల్ అయిన ఇవివి తన రెండవ సినిమా ‘ప్రేమ ఖైదీ’తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లతో సినిమాలు తీసి అరుదైన రికార్డ్ దక్కించుకున్నారు ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘జంబలకిడి పంబ’ సినిమాలతో తనలోని హాస్యకోణాన్ని పరిచయం చేసిన ఇవివి ‘ఆమె’, ‘కన్యాదానం’ వంటి సెంటిమెంట్ చిత్రాలతో కుటుంబ కథా చిత్రాలకు కూడా కేరాఫ్ అడ్రస్ అయ్యారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ‘ సినిమా ద్వారా టాలీవుడ్ కు ఇవివి పరిచయం చేసారు. శ్రీకాంత్, ఊహ జంటగా నటించిన ‘ఆమె’ చిత్రానికి నంది అవార్డ్ అందుకున్నారు. తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ కూడా చిత్రపరిశ్రమలో నటులుగా కొనసాగుతున్నారు అల్లరి నరేష్ లోని కామెడీ కోణాన్ని వినూత్నంగా అనేక సినిమాల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
వాటికి ఉదాహరణే ‘తొట్టిగ్యాంగ్’, ‘కితకితలు’, ‘బెండు అప్పారావ్ ఆర్ ఎం పి’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్ కేజీ ‘ సినిమాలు. రంభ, రవళి, ఊహ వంటి హీరోయిన్స్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. అల్లరి నరేష్ హీరోగా ‘కత్తి కాంతారావు’ సినిమాకు ఇవివి దర్శకత్వం వహించిన చివరి చిత్రం..