Movies

మల్టీ స్టారర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మూవీస్

తమ అభిమాన హీరో తెరపై కనపడితే, సంబరపడిపోయే ఫాన్స్ కి ఇద్దరు, ముగ్గురు హీరోలు కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటే వాళ్ళ ఆనందానికి అవధులుండవ్. ఒకే టికెట్ తో రెండు సినిమాలు చూసినంత హ్యాపీ ఫీలవవుతారు. సోలో హీరోల చిత్రాలకంటే ఇద్దరు హీరోలు కలసి చేసిన చిత్రంపై అంచనాలు భారీగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం మల్టీస్టారర్ ల జోరు టాలీవుడ్ లో విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ ల తాజా మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని ఇప్పటికీ థియేటర్ల వద్ద జోరును కంటిన్యూ చేస్తోంది. ఇటీవల 100 కోట్ల మార్క్ ను చేరుకొని.. ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లోకి చేరిన అతి తక్కువ సినిమాలలో ‘ఎఫ్ 2’ లో వెంకటేష్, వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లుగా నటించిన తీరు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది.

అటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో నటించిన వెంకటేష్ ఇటు యువ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించడం విశేషం. ఇక ఈ మల్టీస్టారర్ ల ట్రెండ్ 2019 లోను కొనసాగుతుంది. వెంకటేష్, నాగ చైతన్య ‘వెంకీ మామ’ తో సందడి చేయబోతున్నారు. అలాగే మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుంటే, వీటితో పాటుగా రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఆ మధ్య శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం నిజంగా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ తోనే టాలీవుడ్ దర్శకులకు, హీరోలకు మల్టీ స్టారర్ చిత్రాలపై నమ్మకం పెరిగింది. కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన ‘ఊపిరి’ మూవీలో నాగార్జున, తమిళ హీరో కార్తి ముఖ్య పాత్రలు పోషించారు.

‘ది ఇన్‌టచబుల్స్’ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా నిర్మించిన ఈ మూవీలో నాగార్జున, కార్తీల నటన ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. నిజానికి కార్తి ప్లేస్ లో ముందుగా తారక్ ను అనుకున్నప్పటికీ ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ లో బిజీ అవడం వలన ఆ అవకాశం కార్తి దక్కించుకున్నాడు. ఇక 2012లో విడుదల అయిన హిందీ చిత్రం ఓహ్ మై గాడ్! ఆధారంగా వెంకటేష్, పవన్ కళ్యాణ్ తెరకెక్కిన గోపాల గోపాల మూవీ మంచి హిట్ అందుకుంది. కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వం వహించారు.

ముఖ్యంగా నాస్తికుడు పాత్రలో వెంకటేష్, భగవంతుని పాత్రలో పవన్ కళ్యాణ్ నటించి విమర్శల ప్రశంసలు అందుకున్నారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం మూవీలో అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించారు. ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు. తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలన్న అక్కినేని నాగార్జున కల ఈ సినిమాతో నెరవేరింది.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని తొలిసారి కలిసి నటించిన ‘దేవదాస్’ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కింది. నాగార్జున డాన్ గా, నాని డాక్టర్ గా నటించారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. హై ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైన మల్టీ స్టారర్ చిత్రాలలో ‘దేవదాస్’ చిత్రం ఒకటి.

కాగా 70, 80 దశకాల్లో సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు తదితర కాంబినేషన్ లో ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు వచ్చి ఘనవిజయాన్ని సాధించాయి. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హవాలో మల్టీ స్టారర్ చిత్రాలు రాలేదు. కానీ ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ పెరిగింది.