వెండితెరపై రాముడి పాత్రతో మెప్పించిన మన హీరోలు
అప్పటి వాళ్లకే కాదు. ఇప్పటి వాళ్లు కూడా రాముడు గొప్పవాడని ఒప్పుకుంటారు. రాముడిది ఒకే మాట. ఒకే బాణం..ఒకే భార్య …ఒకే విధానం. ప్రెజెంట్ సొసైటీ వెళ్తున్న మార్గాన్ని అనుసరించి చెబితే…రాముడి వ్యక్తిత్వం సమాజానికి ఎంతో అవసరం. తెలుగు వెండితెరపై చాలామంది నటులు రాముని పాత్రలో కనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇప్పటికే రాముడంటే ఎన్టీఆరే. ఇక ఎన్టీఆర్ తర్వాత రాముడుగా మెప్పించిన నటుడు హరినాథ్. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామకళ్యాణం’ సినిమాతో పాటు మరో ‘శ్రీరామకథ’లో హరనాథ్ కోదండ రాముడిగా మెప్పించాడు.అసలు తెలుగు సిన్మా పౌరాణికాలతో ప్రారంభమయింది.
రామకథతో వచ్చిన తొలి సిన్మా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ‘లవకుశ’ సిన్మాలో లక్ష్మణుడిగా మెప్పించిన కాంతారావు…‘వీరాంజనేయ’తో పాటు తదితర కొన్ని సిన్మాల్లో రాముడిగా నటించి మెప్పించారు. ఇక రామారావు, కాంతారావు కంటే ముందే ఏఎన్నాఆర్ ఆయన నటజీవితాన్ని ‘సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం. భారతదేశంలో రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది.
రాముడు మంచి బాలుడు అన్న సామెత అందుకే వచ్చింది. అలాంటి రాముడికి తెలుగు సిన్మాకు అవినాభావ సంబంధం వుంది. రాముని అవతారం ఎంతో ఉన్నతమైనది. వింటే భారతం వినాలి. కంటే రామాయణం కనాలన్న సూత్రాన్ని ఫాలో అవుతారు. అందునా తెలుగువాళ్లకు రాముడంటే వల్లమాలిన అభిమానం. అలనాటి ‘లవకుశ’ నుంచి నేటి ‘శ్రీరామరాజ్యం’ వరకు రామగాధను గానం చేస్తూ, రాముడి గొప్పతనాన్ని ప్రకటించాయి. వెండితెర శ్రీరాముడిగా ప్రశంసలు అందుకుని రాముడంటే ఇలాగే ఉంటాడా….అనిపించే స్థాయిలో నటించిన ఘనత ఎన్.టి.ఆర్ కే దక్కుతుంది.శ్రీరాముడి పాత్రకు ఏ మేరకు నటించాలో అంతగా నటించి అద్భుతం అని ఎన్టీఆర్ అనిపించారు .
సీతా వియోగ ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని ఇలా నవరసాలను మేలవించి శ్రీరాముడి పాత్రలో లీనమై ఎన్టీఆర్ నటించారు. ఇక రాముడిగా శోభన్ బాబుది ప్రత్యేక శైలి. ఎందుకంటే,ఎన్టీఆర్ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఘనత శోభన్ బాబుకే దక్కింది. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో రామయ్య తండ్రీ…ఓ రామయ్య తండ్రీ…మా సామీ వంటి నీవేలే రామయ్య తండ్రీ…అంటూ వచ్చే పాట ఇప్పటికీ తెలుగువారి మదిలో దేవుడిగా రాముని ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. ఇక బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ గాధ ‘సీతా కళ్యాణం’ లో జయప్రద సీతగా నటిస్తే…మలయాళ నటుడు రవి శ్రీరాముడిగా మెప్పించాడు.
ఉత్తారాది వాళ్లకు అయోధ్య ఎలాగో…దక్షిణాది వారికి భద్రాచలం అంతే.ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన శ్రీరామదాసు సిన్మాలో సుమన్ శ్రీరాముడిగా అలరించాడు. రామాయణం పై లవకుశ సినిమాకు రీమేక్ గా వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ సిన్మాలో శ్రీరాముడిగా బాలకృష్ణ అద్భుతాభినయం చేసారు. అలాగే నందమూరి మూడో నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే నటజీవితాన్ని రామాయణం సిన్మాలో రాముడి పాత్రతో ప్రారంభించడం విశేషం. ఇలా మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం కూడా ఒక అద్భుతం. కాగా నవతరం నాయకుల్లో శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించడం విశేషం.