విలన్స్ గా అందరిని భయపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్
స్టార్ హీరోయిన్స్ గా, గ్లామర్ పాత్రల్లో ఆడియన్స్ ని మత్తెక్కించిన హీరోయిన్స్ ఒక్కసారిగా నెగెటివ్ రోల్స్ వేస్తే, తట్టుకోవడం కష్టమే. కానీ నెగెటివ్ రోల్స్ లో కూడా తమకు తామే సాటి అని నిరూపించుకున్న స్టార్ హీరోయిన్స్ కొందరున్నారు. అలనాడు నెగెటివ్ రోల్స్ కి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి, గయ్యాళి అత్తపాత్రలతో తెలుగు ఆడియన్స్ లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న నటి సూర్యకాంతం అంటే తెలియని వారుండరు. పెద్ద కళ్ళు,భారీ కాయం,పెద్ద గొంతుతో కోడలిని రాచి రంపాన పెట్టే అత్తగా, భర్తను నోరెత్తనీయకుండా గుప్పెట బంధించి,పెత్తనం సాగించే గడసరి భార్యగా సూర్యకాంతం నటన ఇప్పటికీ తెలుగువారి కళ్ళలో మెదులుతూనే ఉంటుంది.
ఇలాంటి పాత్ర పోషించాలంటే ఈమెకు ఈమె సాటి. మరి గ్లామర్ పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అలాంటి గ్లామరస్ హీరోయిన్ విలన్ గా మారి,సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. రజనీ కాంత్ హీరోగా వచ్చిన నరసింహ మూవీలో నీలాంబరి పాత్రతో ఆమె విలనిజం చూసాక అందరూ ఆమె గురించే చర్చించుకునేలా చేసింది. ప్రేమించి ప్రియుడు దక్కలేదన్న పగ ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో చనిపోయే వరకూ కంటిన్యూ చేసిన నటన అద్వితీయం. రజనీకాంత్ ని మించిపోయేలా నటించింది. లేడీ విలన్ గా రమ్య నటన సర్వత్రా చర్చకు దారితీసింది.
ఇక ప్రస్తుత తరంలో సమంత ను చూస్తే హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా తన నటనతో మెప్పించిందన్న విషయం చాలామందికి తెలీదు. విక్రమ్ హీరోగా తమిళంలో వచ్చిన మూవీలో విలన్ గా చేసింది. ఇది తెలుగులో టెన్ గా రిలీజ్ చేయనున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, ఇంతలా విలన్ గా మెప్పించిందా అనిపించేలా ఈ పాత్ర వేసింది.
మరోచరిత్ర సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన స్టార్ హీరోయిన్ సరిత ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తూ,డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేసింది. తెలుగు తమిళ,మళయాళ కన్నడ భాషల్లో పలు సినిమాల్లో సపోర్టింగ్ కేరక్టర్స్ కూడా చేసింది. ఎందరో స్టార్ హీరోయిన్స్ కి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఈమె ఒక్కసారిగా విలన్ గా అవతారం ఎట్టి ఔరా అనిపించింది. అర్జున్ సినిమాలో విలన్ కేరక్టర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా హడలు గొట్టింది. గయ్యాళి అత్తగా ఈమె చేసిన నటన ముందు ఈమె భర్తగా నటించిన ప్రకాష్ రాజ్ నటన దిగదుడుపు అయింది.