Politics

పోలింగ్ తర్వాత మంగళగిరి గ్రౌండ్ రిపోర్ట్

ఎన్నికలన్నాక నామినేషన్స్, ప్రచారం, పోలింగ్, లెక్కింపు ఉంటాయని తెలుసు కానీ బెట్టింగ్ కూడా జోరుగానే ఉంటుంది. పందెం రాయుళ్ల సందడి ఎక్కువే ఉంటుంది. ఇక ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో నందమూరి హరికృష్ణ కుమార్తె కూకట్ పల్లి నుంచి పోటీ చేసినపుడు ఏ రేంజ్ లో బెట్టింగ్ సాగిందో ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పోటీచేస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి సీటు గురించి బెట్టింగ్ జోరందుకుంది. ఎమ్మెల్సీ గా ఎన్నికై మంత్రి పదవి చేపట్టడంతో అందరితో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా తొలిసారి బరిలో దిగారు.గుంటూరు జిల్లా మంగళగిరిలో తన సామాజిక వర్గం ఓట్లు పెద్దగా లేకున్నా, లోకేష్ ఏరికోరి మరీ అక్కడే బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

దీంతో అందరి దృష్టి మంగళగిరి వైపు మళ్లింది. నిజానికి ఇక్కడ చేనేత సామాజిక వర్గం ఎక్కువ గా ఉంది. వాళ్ళకే టికెట్ ఇస్తారని భావించినా, అనూహ్యంగా లోకేష్ బరిలో దిగారు. ఇక ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ బరిలో దిగారు. ఒంటిచేత్తో పోరాటం సాగించారు. ఈయనకు టికెట్ దక్కదన్న ప్రచారం సానుభూతి తెచ్చింది. ఇక లోకేష్ ప్రచార పర్వంలో జనం కరువయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కొన్నిచోట్ల మహిళలు నిలదీశారు కూడా. అయినా లోకేష్ తనస్థాయిలో ప్రచారం సాగించారు. అయితే గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవడం టిడిపి శ్రేణుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున బెట్టింగ్ కి తెరలేచింది. అయితే పోలింగ్ ముందురోజు పెద్దఎత్తున డబ్బు పంపిణీ,ఏసీలు,ఫ్రిజ్ లు పంచడంతో కూల్ వాతావరణం కనిపించిందని అంటున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి గురించి జోరుగా చర్చ ,బెట్టింగ్స్ సాగడం విశేషం.