Movies

జెర్సీ సేఫ్ జోన్ లోకి రాలేదా….నష్టాలు తప్పవా?

టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాల్లో ఒకటిగా నిల్చిన జెర్సీ మూవీని గర్వంగా వేరే వాళ్లకు చూపించుకోవచ్చు. తెలుగులో నే కాదు ఇండియాలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ మూవీగా చెప్పవచ్చు. ఒక సినిమా అనుభవం ఉన్న గౌతమ్ తిన్ననూరి, ఎంతో నిజాయితీగా, ఒక కన్విక్షన్‌తో గొప్ప సినిమా తీశాడు. నాని కెరీర్లో మరే సినిమాకు పడనంత కష్టం ఈ సినిమా కోసం పడ్డాడు. పైగా మామూలు నటులు చేయదగ్గ పాత్ర కాదది. అర్జున్ పాత్రను అతను ఎంత గొప్పగా పోషించాడో మాటల్లో  చెప్పలేము. .ఇక ఇలాంటి సినిమా రాజీ లేకుండా నిర్మించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన అభిరుచిని చాటుకున్నాడు. మిగతా నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. మొత్తం మీద అందరూ కలిసి ఒక మైలురాయి లాంటి సినిమా ఆడియన్స్ ముంగిటకు తెచ్చారు.

ఇంతమంది ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత అభిరుచి ఉన్న ప్రేక్షకుల మీద కూడా ఉంది. ఈ సినిమాకు చాలా మంచి సమీక్షలు వచ్చాయి. చూసిన వాళ్లందరూ సినిమా అద్భుతం అని చెబుతున్నా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి వారంలో వరల్డ్ వైడ్ ‘జెర్సీ’ రూ.21 కోట్ల షేర్ వాసులు చేసింది. కానీ ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం ఇంకా మెరుగైన వసూళ్లు రావాలి.బ్రేక్ ఈవెన్‌ మార్కు దాటేయాలి.పరిస్థితి చూస్తే, అందుకు పూర్తిభిన్నంగా ఉంది.

ఈ చిత్రానికి రూ.6 కోట్లకు పైగా షేర్ వస్తే తప్ప బయ్యర్లు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదన్నది వాస్తవం. ప్రస్తుతం ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రభంజనం చూస్తుంటే, రెండో వారంలో ‘జెర్సీ’ ఏమాత్రం షేర్ తెస్తుందోనన్న సందేహం వస్తోంది. అంతేకాదు, ‘హిట్’ కేటగిరిలోకి చేరకుండా బ్రేక్ ఈవెన్‌కు ముందే ఆగిపోతుందేమోనన్న భయం వెంటాడుతోంది. అదే పరిస్థితి వస్తే, ఇంత గొప్ప ప్రయత్నం చేసిన చిత్ర బృందం కి నిరాశ మిగలడం తప్ప మరొకటి ఉండదు. ఇలాంటి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం వస్తే ఈ కోవలో మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఆస్కారముంటుంది. సీన్ రివర్స్ అయితే ఇలాంటి సాహసాలకు ఫిలిం మేకర్స్ ముందుకొచ్చే పరిస్థితులు కనిపించవు.