Politics

జగన్ నిశ్శబ్ధం విస్పోటనమా ?

ఏపీలో హోరాహోరీగా ఎన్నికల పోరు ముగిసి ఇక లెక్కింపు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విజయం తమదంటే తమదని అభ్యర్థులు గట్టిగా చెబుతున్నారు. తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయ్,అన్ని సీట్లు వస్తాయ్ అని అంటున్నారు. ఇక చంద్రబాబు కూడా నిత్యం వార్తల్లో ఉంటూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోస్తున్నారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వందకి వెయ్యి శాతం గెలుపు తమదేనని చెబుతున్నారు. మరోపక్క ఈవీఎం లను తప్పుపడుతూ,వివి ఫ్యాట్ లను లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి ఎన్నికల సంఘాన్ని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు.

జగన్ ని కూడా టిడిపి నేతలు రకరకాలుగా దూషిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా సరే, వైసిపి నేత జగన్ మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూల్ గా ఉన్నారు. ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ తలపడి, విమర్శలు గుప్పించిన జగన్ ఎన్నికల తర్వాత తమదే విజయమని, భారీ మెజార్టీతో వైసిపి గెలుస్తోందని ప్రెస్ మీట్ లో ప్రకటించి ఆతర్వాత నుంచి మౌనం దాల్చేసారు. ఎక్కడా మాట కూడా మాట్లాడకుండా నిశబ్దం పాటిస్తున్నారు. విదేశాలు వెళ్లినా సరే అక్కడ కూడా నోరు విప్పలేదు. ఇక వైసిపి శ్రేణులు కూడా మౌనం దాల్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా జగన్ పోస్టులు పెట్టలేదు. విజయం గురించి టిడిపి నేతలు రోజూ మాట్లాడుతున్నా సరే,జగన్ మాత్రం మౌనంగానే ఉన్నారు.

ఎక్కడా సమీక్షలు చేయడం లేదు. దీంతో జగన్ మౌన మునిలా ఎందుకు మారిపోయాడని సర్వత్రా చర్చ నడుస్తోంది. అధికార టిడిపి ఎన్నో మాట్లాడుతున్నా జగన్ ఒక్క మాటా మాట్లాడకపోవడం వెనుక మర్మమేమిటని జనంలో ప్రశ్న మొదలైంది. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమని కొందరు విశ్లేషిస్తున్నారు. 2014లో చేదు అనుభవం దృష్ట్యా ఈసారి సైలెంట్ గా ఉండాలని జగన్ భావిస్తున్నారట. పైగా చాలా సర్వేలు వైసీపీదే విజయమని చెప్పినందున ఇలాంటి సమయంలో అనవసరంగా మాట్లాడ్డం కంటే, మౌనంగా ఉండడమే మంచిదన్న ఉద్దేశ్యంతో జగన్ ఎక్కడా కంగారు పడడంలేదని అంటున్నారు. మొత్తానికి జగన్ నిశ్శబ్డం అధికారం తెస్తుందా లేదా అనేది ఈనెల 23న లెక్కింపులో తేలనుంది.