Movies

ఆ సినిమా హాల్‌లో బెడ్‌పై పడుకుని మూవీ చూడొచ్చు.. టికెట్ ధరెంతో తెలుసా?

రెండు నుంచి మూడు గంటల సేపు సినిమా చూడాలంటే ఎంత ఓపిక ఉండాలి. పైగా, సీటు సౌకర్యవంతంగా లేకపోతే ఇక నరకమే. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని మల్టిఫ్లెక్స్‌లలో హాయిగా నడుము వాల్చుకుని చూసేలా కుర్చీలు, సోఫాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, స్విట్జర్లాండ్‌లోని ఓ సినిమా హాల్‌‌లో ఏకంగా డబుల్ బెడ్‌లనే ఏర్పాటు చేశారు. 

‘సినిమా పాథ్’ అనే మల్టిఫ్లెక్స్‌లో ఇటీవల ‘వీఐపీ బెడ్రూమ్ స్క్రీన్’ను ప్రారంభించారు. సీట్లకు బదులు హాల్ మొత్తం డబుల్ బెడ్స్‌తో నింపేశారు. అంతేకాదు, తలగడలు, దుప్పట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ థియేటర్లో మొత్తం 11 బెడ్‌లను ఏర్పాటు చేశారు. థియేటర్లో డ్రింకులు, పాప్‌కార్న్‌లు పెట్టుకునేందుకు బెడ్ పక్కనే చిన్నసైజు టేబుల్స్ కూడా ఉన్నాయి. మరి ఇన్ని సదుపాయాలున్న ఈ ‘వీఐపీ బెడ్‌రూమ్ స్క్రీన్’ టికెట్ ధర ఎంత తెలుసా? జస్ట్ 48.5 డాలర్స్.. భారత కరెన్సీలో రూ.3,406. డ్రింక్స్, స్నాక్‌లు ఉచితంగా అందిస్తారు. 

ఇంకా ఎన్నో ప్రత్యేకతలు: ‘సినిమా పాథ్’లో ఇంకా ఇలాంటి ప్రత్యేకలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని స్క్రీన్లలో డబుల్ సోఫాలు, ఐమ్యాక్స్ స్క్రీన్, కిడ్స్ సినిమా, బీన్ బ్యాగ్స్ సీట్లు వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే, థియేటర్లో మెట్లు ఎక్కడానికి కష్టపడేవారి కోసం ప్రత్యేకంగా స్లైడ్లు కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇలాంటి థియేటర్ మనకు కూడా అందుబాటులోకి రావాలని కోరుకుందాం