నటుడు రాళ్ళపల్లి ఇక లేరు…. అయన గురించి మీకు తెలియని 3 నిజాలు
73 ఏళ్ళ వయస్సులో కన్నుమూసిన ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు ప్రతిభావంతుండైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటకరంగం నుంచి వచ్చిన రాళ్ళపల్లి ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించి మెప్పించారు. తనికెళ్ళ భరణి వంటి దిగ్గజాలు సైతం నాటకాల్లో రాళ్ళపల్లి శిష్యులే. వయస్సు పైబడినా ఎదో ఒక సినిమాలో కనిపిస్తూ ఉండేవారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు వేసుకొని నటనా జీవితానికి శ్రీకారం చుట్టారు.కెరీర్ లో 8వేల నాటకాలు వేసిన రాళ్ళపల్లి స్వీయ రచన దర్శకత్వం వహించినవే ఎక్కువ ఉన్నాయి. అనంతరం 1974లో ‘స్త్రీ’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి, ఊరుమ్మడి బతుకులు, చలి చీమలు వంటి అభ్యుదయ చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.
శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్ 1 విడుదల, సూర్య ఐపీఎస్, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య, సుందరకాండ, భలే భలే మగాడివోయ్ ఇలా రాళ్ళపల్లి తన కెరీర్ లో 850కి పైగా చిత్రాల్లో నటించారు. 1945 ఆగస్టు 15న అనంతపురం జిల్లా కంబదూరులో జన్మించిన రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇష్టమైన మెడిసిన్ చదవడానికి రష్యా వెళ్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె విమానం ఎక్కేసమయానికి తీవ్ర జ్వరం తో ఉండడం,విమానం గాల్లో ఉన్న సమయంలో మరింత అస్వస్థతకు గురవ్వడంతో వైద్య సాయం అందలేదు. ఫలితంగా ఏ విమానంలో బయలుదేరిందో అదే విమానంలో విగత జీవిగా స్వదేశానికి వచ్చింది. ఇక మరో అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది.
రాళ్ళపల్లి టివి సీరియల్స్ లో ఎక్కువగా నటించేవారు. దూరదర్శన్ లో ఎక్కువగా నటించారు. గణపతి అనే సీరియల్ లో నంది అవార్డు కూడా అందుకున్నారు. నాటకరంగం నుంచి వచ్చిన డబ్బులను మళ్ళీ నాటక రంగానికే వినియోగించేవారు. అప్పులపాలైన రాళ్ళపల్లి ఓసారి ఇంటికి వచ్చే సమయానికి ఆయన ఇంట్లోని సోఫాలు అప్పులవాళ్ళు తీసుకుపోతుంటే,తనికెళ్ళ భరణి వంటివాళ్ళు డబ్బులు పోగేసి విడిపించారు. వాళ్ళ ప్రోత్సాహంతో మద్రాస్ వెళ్లి నటుడిగా రాణించారు.
ఇక రాళ్లపల్లికి చేయితిరిగిన వంటవాడు కూడా ఆయనలో దాగి ఉన్నారు. ఆయన వంట చేస్తే అందరూ లొట్టలేస్తూ తినాల్సిందే. కె విశ్వనాధ్, జంధ్యాల,కమల్ హాసన్ వంటి వాళ్ళు రాళ్ళపల్లి వంటకోసం తహతహలాడేవారట. సెట్స్ లో ఆయన సీన్స్ ముందే అయ్యేలా చూసేసి,మధ్యాహ్నం రెస్ట్ ఇచ్చేవారట. ఎందుకంటే ఆయన సీన్స్ అయిపోతే వంటిమీద దృష్టిపెడతారని భావించేవారట. ‘మీరు సినిమాలు వదిలేస్తే ఎక్కడికి వెళ్లొద్దు మద్రాస్ వచ్చి నాకు వంట చేసి పెట్టండి చాలు’అని కమల్ హాసన్ అనేవాడట.