Movies

లారెన్స్‌ని తప్పించారా.? తప్పుకున్నాడా?

సినిమాకి అన్నీ తానై అంతా తానై పని చేసే వ్యక్తి లారెన్స్‌. హీరో, డైరెక్షన్‌, స్క్రీన్‌ప్లే, కథ, మాటలు, కొరియోగ్రఫీ.. ఇలా అంతా తానే అయ్యి సినిమాలు తెరకెక్కిస్తుంటాడాయన. అందుకే లారెన్స్‌ మార్క్‌ సినిమాలన్నీ ఓ స్థాయిలో ఉంటాయి. ఇంతవరకూ తెలుగు, తమిళ భాషల్లోనే పేరు తెచ్చుకున్న లారెన్స్‌ ఇక బాలీవుడ్‌లోనూ సత్తా చాటాలనుకున్నాడు.

తనకు పేరొచ్చిన హారర్‌ కామెడీ చిత్రాలతోనే హిందీలోనూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. వన్‌ ఫైన్‌ డే అందుకు ముహూర్తం కూడి సిద్ధమైంది. బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ని హీరోగా పట్టేశాడు.. నిర్మాతలూ దొరికారు. ఇక మిగిలినవన్నీ తానే కాబట్టి, ఆలస్యం చేయకుండా సినిమాని పట్టాలెక్కించేశాడు. కొంత భాగం షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేశాడు. అన్నట్లు ఈ మధ్య లారెన్స్‌ సినిమా (‘కాంచన’ హిందీ రీమేక్‌ అన్నమాట) ఫస్ట్‌లుక్‌ కూడా విడుదలయ్యిందండోయ్‌. అసలు ట్విస్ట్‌ ఇదే. సిసలు తంటా కూడా ఇదే.

ఈ ఫస్ట్‌లుక్‌ని లారెన్స్‌కి తెలియకుండా విడుదల చేసేశారట. అలా ఎలా విడుదల చేస్తారంటూ లారెన్స్‌ వాదించాడట. ఆ పై ఇక తెర వెనుక ఎంత రాద్ధాంతం జరిగిందో తెలీదు కానీ, సినిమా దర్శకత్వం నుండి లారెన్స్‌ తప్పుకున్నాడు. అయితే, కారణం ఇదేనా.? నిజంగానే లారెన్స్‌ తప్పుకున్నాడా.? లేక కావాలని తప్పించేశారా.? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మధ్య బాలీవుడ్‌లో దక్షిణాది డైరెక్టర్లకు ఇలాంటి అవమానాలే జరుగుతున్నాయి. మొన్న క్రిష్‌, నిన్న సందీప్‌ రెడ్డి, ఈ రోజు లారెన్స్‌.. ఇంకా ఎన్నాళ్లో ఈ అవమానం.? దక్షిణాది దర్శకులకు బాలీవుడ్‌లో గౌరవం దక్కేదే లేదా.? వేచి చూడాలిక.