రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మౌనం వీడి అడుగులు ఎటు వేస్తాడో…?
తెలుగువారి ఆత్మ గౌరవం పేరిట స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ తేలుగుదేశం. పార్టీ పెట్టిన 9నెలల్లోనే అద్వితీయంగా విజయాన్ని సొంతం చేసుకున్న పార్టీ. ఇప్పటికీ జనం గుండెల్లో ఉన్న ఈ పార్టీలో ఆయారాం- గయారాంలు ఈమధ్య ఎక్కువయ్యా రన్న మాట బలంగా వినిపిస్తోంది. చిన్న రాముడ్నైనా కాపాడుకుంటారా అంటే అదీ లేదు. ఇదీ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అదేనండీ, చిన్న రాముడంటే, అచ్చుగుద్దినట్లు తాత పోలికలను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే,తేజంలో, రూపంలో, నైజంలో, నందమూరి నాయకుల గుణగణాలే టీడీపీకి ఆయువు పట్లు గా చెబుతారు.
ఇంతకీ తెలుగుదేశం పార్టీలో పార్టీ వర్సెస్ జూనియర్ ఇష్యూ ఏం చెబుతోంది? తెలుగుదేశంలోకి రామయ్య రీ ఎంట్రీ ఉంటుందా లేదా అని సర్వత్రా చర్చ నడుస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ పేరు పుణికిపుచ్చుకుని, నట వారసత్వంలో ఆయన అడుగు జాడల్లో దూసుకుపోతున్నాడీ చిన్నఎన్టీఆర్. అలాంటి బుడ్డోడు ఇప్పుడు టీడీపీకి ఏమవుతాడు? ఈక్వేషన్లను చూస్తే, జూనియర్ ఇటా అటా? అని అంటున్నారు. ఇతగాడిని తెలుగుదేశం నిజంగానే కూరలో కరివేపాకుల వాడుకోని ఒదిలేసిందా? నందమూరి బ్యాచ్ లోకెల్లా యంగ్ అండ్ డైనమిక్ హీరో కదా. పైగా యాక్టింగ్ స్కిల్స్ లో సీనియర్ కు ఏ మాత్రం తీసి పోని టాలెంట్ సైతం ఉందని అంటారు.
సినిమాల పరంగా ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించిన తీరు అమోఘం. వారి నాడి పట్టి చేసే నటన అద్భుతం. అభిమానులను సొంతం చేసుకున్న తీరు కూడా గ్రేట్ గానే చెబుతారు. నిజానికి ఎన్టీఆర్ కీ, టీడీపీకీ రాజకీయంగా విడదీయలేని అనుబంధం. పాపం ఈ విషయం ఎంత అయిష్టమైనా చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఇక నటవారసత్వంలో బాలకృష్ణ తర్వాత ఆ బాధ్యతలు భుజానికెత్తుకుని జూనియర్ ఒక రేంజ్ లో దూసుకు పోతున్నాడు. హిట్టు మీద హిట్టు కొట్టేస్తూ, మంచి టెంపర్ మీదున్నాడు. ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీకి టానిక్కుల్లా పనిచేస్తుంటాయి. ఆ పార్టీ వారు ఎంత స్ట్రాటజీ ప్లే చేసినా, టీడీపీకి నిజమైన బ్రాండ్ అంబాసిడర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పక తప్పదని అంటున్నారు. మరి జూనియర్ ని ఏవిధంగా పార్టీ ట్రాక్ లోకి తీసుకొస్తారో చూడాలి.