Politics

నగరిలో రోజా ఓటమిని ఎగ్జిట్ పోల్స్‌ చెప్పేసాయా…???

ఏపీ లో ఏప్రియల్ 11న పోలింగ్ జరిగాక విజయం తమదంటే తమదని చెప్పేసి ఎంచక్కా అందరూ విశ్రాంతి తీసుకుంటూ ధీమాగా ఉన్నారు. ఇక 23న లెక్కింపు కోసం సన్నద్ధం అవుతుంటే, ఉన్నట్టుండి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఈ ఫలితాలతో ఇప్పుడు రాజకీయ నేతల లో మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. కొందరు ముఖ్య నేతలు తమతమ నియోజకవర్గాల్లో ఓడిపోతున్నట్లుగా సర్వేలు చెప్పడంతో ఆయా నేతలు మరింత ఆందోళనలో పడిపోయారు. అధికారం తమదే అని ఎదురు చూస్తున్న వైసీపీ విషయానికి వస్తే, ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా నగరిలో ఓడిపోతారనే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.

దాదాపు ఏపీ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌లో ఇదే తేలింది. లగడపాటి సర్వేతో పాటు, ఆరా అనే సంస్థ ఏపీ ఎన్నికల ఫలితాలపై చేసిన సర్వేలో రోజా ఓటమి తప్పదని ఇదే తేల్చారు. ఆరా సర్వే ప్రకారం ఈసారి రోజా ఓడిపోతారని తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే, జగన్ పార్టీలో రోజాకు లేడీ కోటాలో హోంమంత్రి పదవి ఖాయమన్న టాక్ బయలుదేరింది. అందువల్ల కొందరు చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలే నగరిలో రోజా ఓటమికి స్కెచ్ గీసినట్లు టాక్ నడుస్తోంది. సొంత జిల్లాలోనే మంత్రి పదవుల్ని ఆశిస్తున్న కొందరు సీనియర్ నేతలు రోజా గెలిస్తే తమకు మంత్రి పదవి రేసులో పోటీ వస్తుందని ఆమె ఓటమికి ఎన్నికలకు ముందే ప్రణాళికలు రచించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

దీంతో నగరిలో రోజాకు ఓటమి తప్పదని భావిస్తున్నారు. దీనికి తోడు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద లగడపాటి సర్వేతో పాటు ఆరా సర్వే కూడా నగరిలో రోజా ఓడిపోతున్నారనే తేల్చాసాయి. ఇక మరో సర్వే కూడా ఇదే తేల్చింది. దీంతో ఇప్పుడు రోజా గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్‌ను గుడ్డిగా నమ్మలేమన్నారు. తన వరకు అయితే ఇలాంటి సర్వేలను నమ్మనని తేల్చేశారు. ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు రోజా.

ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని అన్నారు. పైకి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల ఆమెను ఎగ్జిట్ పోల్స్ భయం వెంటాడుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా నగరి నుంచి టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై పోటీ చేసి, రోజా గెలుపొందారు. 2004లో నగరి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రోజా ఆ తర్వాత వైఎస్ బతికి ఉండగానే కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు.