Movies

సినారె సొంత ఊరి కోసం ఎంతో చేస్తే… చివరకు ఏమైందో తెలుసా?

ఎన్టీఆర్ నటించిన గులేబకావళి కథ మూవీతో పాటల రచయితగా డాక్టర్ సి నారాయణ రెడ్డి (సినారె) ఎంట్రీ ఇచ్చి ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ పాట అజరామరంగా నిలిచిపోయేలా చేసారు. మరపురాని గీతంగా నిలిచిపోయింది. ఈ పాట తర్వాత ఆయన ఆయన ఏకంగా 3వేలకు పైనే పాటలు రాసారు. మరపురాని మధుర గీతాలు,శృంగార గీతాలు,యుగళ గీతాలు ఇలా అన్ని రకాల పాటలను ఆయన అలవోకగా రాసి జనహృదయాల్లో పాడుకునేలా చేసారు. గేయ నాటికలు కూడా ఎన్నో రాసారు. నవ్వని పువ్వు అనే సంగీత రూపకం కూడా అందులో ఉంది. 1953లో ప్రచురితమైంది. 

అజంతా సుందరి అనే మరో రూపకం రాసారు. శిల్ప కావ్య జీవితాలకు అద్దం  పట్టేవిధంగా ఇవి ఉంటాయి. కరీం నగర్ జిల్లా హనుమాజీ పేటలో 1931న పుట్టి 2017జూన్ 12న స్వర్గస్తులైన డాక్టర్ సినారె తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు. ఈయన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తే, సినారె మాత్రం సాహితీ వ్యవసాయం చేసారు. బాల్యంలోనే బుర్రకథలు,హరికథలు ఇతర రూపకాల్లో పట్టు సాధించారు. ఉర్దూమీడియంలో మాధ్యమిక విద్య,కరీంనగర్ లో ఉన్నత విద్య,ఉస్మానియాలో బిఎ ఉర్దూ పూర్తిచేశారు. తెలుగు పిజి చేసి,పరిశోధనలో డాక్టరేట్ అయ్యారు. ఇక బాల్యంలోనే సుశీల అనే ఆమెతో పెళ్లయింది. గంగ,యమున, సరస్వతి,కృష్ణవేణి అనే నలుగురు ఆడపిల్లలు ఈయనకు ఉన్నారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్ గా చేసిన ఈయన నిజాం కాలేజీలో అధ్యాపకునిగా చేసారు.

ఇక సినారె రాసిన రామప్ప సంగీత నృత్య నాటిక అన్ని భాషల్లో అనువాదమైంది. ఎన్నో దేశాలు సందర్శించిన ఈయన 1990లో యుగోస్లోవేయాలో అంతర్జాతీయ కవిసమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా హాజరయ్యారు. స్రవంతి సాహిత్య మాస పత్రికను నడిపారు. పదాలతోనే జీవితమంతా ఆడిపాడి,వాటితోనే కడుపు నింపేసుకున్న డాక్టర్ సినారె అందులోనే పరితపిస్తూ, ధ్యానిస్తూ నిదురించడం ఆయన నైజం. వస్తాడు నా రాజు ఈరోజు, వగల రాణివి నీవే,చాంగురే బంగారు రాజా,తెలిసిందిలే , నువ్వు నా ముందుంటే,ఇలా ఎన్నో గీతాలు ఆయన పదరచనకు అద్దంపడతాయి. ఇక ‘ విశ్వంభర’ తో జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్నారు.

విశ్వనాధ సత్యనారాయణ తర్వాత తెలుగులో జ్ఞానపీఠ్ అవార్డు పొందిన వ్యక్తి గా నిలిచారు.ఇక ఈయన వందెకరాల ఆసామి. సాహితీ ప్రకర్షలో పడి దానధర్మాలు చేసిన ఈయన తన భూమిని ఎకరాకు చేర్చారు. సొంతూరులో గ్రంధాలయం ఏర్పాటుచేసి సాహితీవ్యాప్తికి ఎనలేని కృషి చేసారు. అయితే ఆ గ్రంథాలయాన్ని ఊరివాళ్ళు అసలు వినియోగించుకోకపోవడం పట్ల ఆయన బాధపడేవారు. ఇక హైదరాబాద్ లో ఈయన లేని సాయంకాల సమావేశాలు ఉండేవి కావంటే అతిశయోక్తి కాదు. రాజ్యసభ సభ్యునిగా చేసారు. ఇక తెలుగు జాతి మనది అంటూ ఈయన రాసిన గీతం సమైక్య స్ఫూర్తి నింపింది. దీంతో తెలంగాణా వాదులనుంచే అయన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చినా అయన లెక్కచేయలేదు.