Movies

విలన్ గా నాని…రిస్క్ చేస్తున్నాడా…???

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ‌త‌హాగా ఎదిగిన హీరో లలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి హీరోగా ట‌ర్న్ తీసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ దూసుకెళ్తున్నాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం నుంచి వ‌రుస‌గా విజ‌యాల‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. మ‌ధ్య‌లో కృష్ణార్జున‌యుద్ధం డిజాస్టర్ అయినప్పటికీ కెరీర్ గ్రాఫ్‌ని త‌గ్గించ‌లేక‌పోయింది. ఇక తాజాగా జెర్సీ సినిమాతో కెరీర్ బెస్ట్ విజ‌యాన్ని పొందాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగా, ప్ర‌శంస‌ల ప‌రంగా ఈ సినిమా నాని కెరీర్‌లోనే అత్యుత్త‌మ చిత్రంగా నిల్చిందన్న టాక్ వచ్చింది. అంతేకాదు స్టార్ ఇమేజ్‌తోపాటు మార్కెట్‌ని పెంచింది. త‌న న‌ట‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించారు. 

అయితే నాని హీరోగానే కాదు, ఇప్పుడు విల‌న్‌గానూ త‌న స‌త్తా చాటుతున్నాడు. ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జెంటిల్‌మెన్‌లో త‌నలోని నెగ‌టివ్ షేడ్‌ని చూపించి ఆడియెన్స్ చేత, సినీ వ‌ర్గాల చేత వాహ్‌.. అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న మ‌రోసారి విల‌న్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. మ‌రో సారి ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలోనే ఆయ‌న నెగ‌టివ్ షేడ్ ఉన్న‌పాత్ర వేస్తున్నాడు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా, అదితి రావు హైద‌రీ, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమా ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నాని నెగ‌టివ్ షేడ్ పాత్ర‌లో అలరించబోతున్నాడట.

ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంద‌ని, మ‌హాభార‌తంలో క‌ర్ణుడి పాత్ర‌ని పోలి ఉంటుంద‌ని అంటున్నారు. ఫ్రెండ్ షిప్ కోసం అనుకోని ప‌రిస్థితుల్లో నాని నెగ‌టివ్‌గా ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు ఆయ‌న‌ పాత్ర‌లో ఎమోషనల్ షేడ్ కూడా ఉంటుంద‌ట‌. మొత్తానికి నాని విల‌న్‌గా మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌ చూపించ‌బోతున్నాడని అంటున్నారు. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్‌లీడ‌ర్ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లోనే విడుద‌ల కానుంద‌ని టాక్‌. మ‌రోవైపు శ్రీకాంత్ అడ్డాల‌తో గీతా ఆర్ట్స్ నిర్మించే ఓ సినిమా చేస్తాడని అంటున్నారు.