Movies

పవన్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో తెలుసా?

మార్పుకోసం జనసేన నినాదంతో పార్టీని జనంలోకి తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసినా ఫలితం దక్కలేదు. భీమవరం,గాజువాక లలో కనీసం ఒక్క చోటైనా పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ దక్కేది. కోట్లాది అభిమానుల ఆశల్ని నీరుగారుస్తూ రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూడటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనని ఓ రేంజ్ లో వెళ్లగక్కుతున్నారు. అయితే ఇలా ఓడిపోవడం వలన ఖచ్చితంగా పవన్ తో సినిమాలు చేయాలనీ సంకల్పించుకున్న నిర్మాతల లో సంతోషం వ్యక్తం అవుతోందట. ఎంతలేదన్నా ఓ మూడు రోజులు మాట్లాడుకుని జనసేన గురించి పబ్లిక్ తాత్కాలికంగా మర్చిపోతారు. జగన్ కొత్త పాలన గురించి చర్చలు సాగుతాయి. అందరి చూపు అటు వైపే ఉంటుంది. 

ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు పోషించే పాత్ర మరో వైపు అటెన్షన్ తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో పవన్ పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఉద్దానం లాంటి సమస్యల కోసం ప్రజా క్షేత్రంలో పోరాడోచ్చు కాని అది ఇప్పుడు మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు అందుకే ఇంకో మూడేళ్ళు ఓ నాలుగైదు సినిమాలు చేసి ఓ ఎంతో కొంత నిధులు సమీకరించుకోవడం పవన్ ముందున్న బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఊపిరి చివరి వరకు రాజకీయల్లోనే కొనసాగుతానని పవన్ చెప్పినప్పటికీ గ్యాప్ లో ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా చర్చకు దారితీస్తోంది. ఎలాగూ మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు ఎప్పుడెప్పుడా అని పవన్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదే మంచి నిర్ణయం అని అంటున్నారు. 

అయితే ఇప్పటివరకూ చేస్తున్న తరహాలో కాకుండా ముఖ్యంగా కుర్ర చేష్టలు ఉండే సినిమాలు కాకుండా కాస్త ఇమేజ్ ని బాలన్స్ చేస్తూ ఉండే పవర్ ఫుల్ సబ్జెక్టులను ఎంచుకుంటే మంచిదే అని అంటున్నారు. కమల్ హాసన్ రజినీకాంత్ లు ఇలాగే చేస్తున్నారని పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఫాలోయింగ్ విషయంలో పవన్ కు తిరుగు లేదు. దాన్ని నిలబెట్టుకునేలా కాస్త జాగ్రత్తగా కథలు ఎంచుకుంటే ఇబ్బందేమీ ఉండదని, ఆర్ధికంగా కూడా బాగుంటుందని అంటున్నారు. ఒకవేళ జనసేన కోసమే పూర్తి స్థాయిలో అంకితం అవ్వాలనుకుంటే, 175 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్లను గుర్తించి దానికి తగ్గ కార్యాచరణ 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని అంటున్నారు. అందుకే ఇప్పుడు విస్తృతంగా పర్యటనలు చేస్తూ, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకోవాల ని సూచిస్తున్నారు. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.