ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ప్లాన్ ఇదే?
మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో పోటీ చేసిన రెండు స్థానాలు కోల్పోయిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ సినిమాలు చేస్తాడని త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఇలా రకరకాలుగా మీడియాలో ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కొందరి దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నందున సినిమాలు చేస్తాడని టాక్ వస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కొత్త రాజకీయ పార్టీ కాబట్టి గెలుపోటములు సహజం అనే రీతిలో భవిష్యత్ ప్రణాళికల కోసం తన టీమ్ తో రెగ్యులర్ గా చర్చల్లో పాల్గొంటూనే ఉండడం విశేషం.
రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పిన పవన్ ఇప్పుడు వస్తున్న గాసిప్స్ కి చెక్ పెట్టేలా ఎలాంటి అఫీషియల్ నోట్ పంప కుండా తన పంథాలో తాను వెళుతున్నాడు. గతంలో ఎన్నికలకు చాలా నెలల ముందు ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు వాటిని ఖండిస్తూ జనసేన అఫీషియల్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా అలాంటిది ఖండన ప్రకటనలు అయితే రాలేదు. ఇక ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ లుక్ ని సైతం ఇంకా మార్చుకోలేదన్న క్లారిటీ వచ్చేసింది.
ఎందుకంటే తాజాగా ఓ అభిమాని దంపతులతో ఫోటోకి ఫోజ్ ఇచ్చిన పవన్ అందులో టి షర్ట్ జీన్స్ తో ఉన్నాడు కానీ గెడ్డం అలాగే గుబురుగా ఉంది. హెయిర్ స్టైల్ లో ఎలాంటి మార్పు లేదు. ఫిజిక్ ఎప్పుడో మారింది కాబట్టి ఇప్పటికిప్పుడు అందులో మార్పులు ఆశించలేం. అందుచేత పవన్ ఇప్పటికిప్పుడు సినిమాలు చేసే ఉద్దేశంలో ఉంటె గెడ్డం తీయడంతో పాటు లుక్ లో చేంజ్ చూపించేవాడు కదా అనే ప్రశ్నలు ఫాన్స్ నుంచి కూడా వస్తున్నాయి. మా నాయకుడికి సినిమా చేయాలనే ఆలోచనే లేదని చెప్పడానికి ఇదే సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీన్నే వైరల్ చేస్తున్నారు. మరి ఇది నిజం అయితే రాజకీయాల్లో పవన్ సీరియస్ గానే కొనసాగుతాడని చెప్పవచ్చు.