Politics

రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఇదేనా… ???

అనూహ్య విజయంతో వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టింది. పార్టీ అధినేత జగన్ సీఎం అయ్యారు. మంత్రి మండలిని కూడా ఏర్పాటుచేశారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్ళు ఎక్కువగా వినిపించిన పేరు రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలుపొందిన రోజా ప్రజా సమస్యలపై స్పందిస్తూ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేవారు. చివరకు చంద్రబాబు సీఎం గా ఉండగా అసెంబ్లీ నుంచి కూడా ఏకంగా ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసి,కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అయితే అధికారంలోకి వస్తే ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన ఆమెకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. 

ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. రోజాకు ఏ మంత్రి పదవి ఇస్తారు,స్పీకర్ ఇస్తారా అంటూ జోరుగా చర్చ నడిచింది. ఆమెకు హోమ్ మంత్రి ఇస్తారని ఆమె అనుచరులు ఊహించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వని చంద్రబాబు చేత అధ్యక్షా అని పిలిపించుకునేలా స్పీకర్ పదవి ఇస్తున్నారని కూడా చర్చ నడించింది. కానీ మంత్రివర్గంలో రోజా పేరు లేదు. ఇక స్పీకర్ కూడా ఎవరో తేలిపోయింది. అయితే స్పీకర్ గా ఇస్తానంటే వద్దని,ప్రజల్లోనే ఉంటానని రోజా చెప్పారట. 

మీరు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానని రోజా స్పష్టంగా చెప్పేసి,ఇక ఫైనల్ గా మీ ఇష్టం అని అనేసారట. సరే నిర్ణయం తీసుకుంటానని చెప్పిన జగన్ చివరకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. ఎందుకంటే, చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి వైసిపి ఆర్ధికంగా, అంగ బలంగా అండగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి,సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అదే జిల్లా, అదే సామాజిక వర్గం కావడంతో రోజాకు ఛాన్స్ దక్కలేదు. అయితే మరో ప్రాధ్యాన్యత గల పోస్టుని ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చారట.