Movies

శ్రీహరి కొడుకు మేఘాంశ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

తెలుగు సినీ రంగంలో హీరోగా, విలన్ గా, కామెడీ విలన్ గా ,క్యారెక్టర్  ఆర్టిస్టుగా రాణించి, మంచి మనుసున్న వ్యక్తిగా పేరొందిన రియల్ స్టార్ శ్రీహరి నటవారసుడు మేఘాంశ్ నటిస్తున్న తొలి సినిమా `రాజ్ దూత్` ఫస్ట్ లుక్ తో సహా తాజాగా రిలీజైన తొలి టీజర్ ఆకట్టుకున్నాయి. శాంతి శ్రీహరి స్నేహితురాలు, జీవిత రాజశేఖర్ స్వయంగా ఈ టీజర్ ఆవిష్కరిస్తూ మేఘాంశ్ ని మీడియాకి పరిచయం చేశారు. ఒకటో సినిమా రిలీజ్ కాకముందే మేఘాంశ్ శ్రీహరికి మరో రెండు అవకాశాలు క్యూకట్టడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్. తొలి సినిమా ఈవెంట్ లోనే వీటిని ప్రకటించడం మరో బిగ్ సర్ ప్రైజ్. ప్రస్తుతం డెబ్యూ హీరో మేఘాంశ్ దూకుడుపై శ్రీహరి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ పరిచయ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

చిన్న పిల్లలు కళ్ల ముందే హీరోలు, హీరోయిన్లుగా ఎదిగేస్తున్నారు. మా అమ్మాయి శివానీకి  చిన్నప్పటి నుంచి శాంతి కుటుంబంతో అనుబంధం ఉంది. ఇప్పుడు శివానీ, శివాత్మిక హీరోయిన్లు అవుతున్నారు. ఇక శివాత్మిక – మేఘాంశ్ క్లాస్ మేట్స్. కలిసే చదువుకున్నారు. మేఘాంశ్ – శివాత్మిక జంట పక్కపక్కనే కలిసి ఫోటో దిగితే చూడముచ్చటగా ఉంది. ఆ ఇద్దరూ క్లాస్ మేట్స్ .. జంటగా ఫోటో దిగారు .. అది చూసిన తర్వాత ఓ నిర్మాత ఈ జోడీతో సినిమా తీయాలనుందని అన్నారు“ అని జీవిత వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనడం మా వంతు. ఎదగడం వారి వంతు. ఎంతో బాధ్యతగా తీర్చిదిద్దాం’అని ఆమె అన్నారు. హీరో అవుతున్న మేఘాంశ్ ని ఆశీర్వదించారు. శ్రీహరిని మిస్సయినా, మేఘాంశ్ రూపంలో ఇప్పుడు శ్రీహరి మన మధ్యనే ఉన్నారు. అతడికి అందరి ఆశీస్సులు కావాలి అని జీవిత అన్నారు. 

శాంతి శ్రీహరి మాట్లాడుతూ, పెద్దోడు శశాంక్ అచ్చం శ్రీహరిలా ఉంటాడు. చిన్నోడు మేఘాంశ్ నాలా ఉంటాడు. ఇద్దరు హీరోలుగా రాణిస్తారు. మేఘాంశ్ కి అందరి ఆశీస్సులు కావాలి’అని ఆకాంక్షించారు. ఇక ఇదే వేదికపై మేఘాంశ్ తొలి సినిమా నిర్మిస్తున్న ఎం.ఎల్.వి సత్యనారాయణ మేఘాంశ్ హీరోగా తర్వాతి సినిమా నిర్మిస్తున్నామని ప్రకటించారు. మేఘాంశ్ తొలి సినిమా `రాజ్దూత్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నిర్మాతతోనే ఒక సినిమా అధికారికంగా కన్ఫామ్ అయ్యింది. ఇక జీవిత సైతం మేఘాంశ్ – శివాత్మిక జంటతో సినిమా తీసేందుకు ఓ నిర్మాత ఆసక్తిగా ఉన్నారని చెప్పడం చూస్తుంటే, యంగ్ డెబ్యూ హీరో మేఘాంశ్ ఒకటో సినిమా ప్రచార వేదికపైనే మూడు సినిమాల్ని ఖాయం చేసుకున్నాడు. శ్రీహరిలా నలుగురికి సాయం చేసే మంచి మనసున్న మనిషి వారసుడిగా మేఘాంశ్ ఎదగాలని పలువురు పేర్కొన్నారు.