తేజ బాల్యం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టడం ఖాయం
తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరిదీ ఒక్కో బాణీ. ఒక్కో స్టైల్. దర్శకుడు తేజ చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చి నువ్వునేను సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, ఎంతో మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు. టాలీవుడ్ లో ఓ విలక్షణ వ్యక్తిత్వం గల దర్శకుడు గా గుర్తింపు పొందాడు. ఆయన ముక్కుసూటితనానికి చాలా అవకాశాలు కోల్పోయినా సరే కష్టాన్ని నమ్ముకుంటూ టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ లో తాను ఇంత ఎత్తుకు ఎదిగినా తన బాల్యం మాత్రం ఎంతో చేదు జ్ఞాపకాలతో నిండిపోయిందని ఓ ఇంటర్వ్యూలో తేజ ఎమోషనల్ అయ్యారు. తన జీవితం కష్టాలు కన్నీళ్ల మయమని.. వింటే కన్నీళ్లు కార్చడం ఖాయమని చెప్పుకొచ్చారు.
తను పేద కుటుంబంలో పుట్టలేదని, తమది ఎక్స్ పోర్ట్ వ్యాపారమని, మా నాన్న గొప్ప వ్యాపారం చేసేవాడని తేజ వివరించాడు. తాను- అక్క- చెల్లి ముగ్గురు సంతానమని, రాజభోగాలు చిన్నప్పుడు అనుభవించామని అన్నాడు. కానీ మా అమ్మ మరణంతో తమ పరిస్థితి తలకిందులైందని, ఎందుకంటే, నాన్న కృంగిపోయి వ్యాపారాన్ని పట్టించుకోకపోవడంతో నష్టాలు వచ్చి ఆస్తులన్నీ పోయి నాన్న మానస్తాపంతో చనిపోయాడని తేజ వివరించారు. ‘దీంతో ముగ్గురు పిల్లలం కూడా అనాథలం అయ్యాం, మా అక్క పెళ్లి చేసుకొని పోగా, చెల్లిని బంధువులు స్వచ్ఛంద సంస్థలో చేర్చారు. నన్ను మా బాబాయి తీసుకెళ్లా డు’అని తేజ వివరించారు.
తాను అక్కడ ఉండలేక విజయవాడ వెళ్లి బతుకు దెరువు కోసం లారీ క్లీనర్ గా చేరానని, హోటల్ లో కూడా పనిచేశానని తేజ చెప్పాడు. చివరకు చెన్నై వెళ్లి కెమెరా అసిస్టెంట్ గా చేరి వాళ్లు పెట్టే ఒకపూట భోజనంతో కడుపు నింపుకొని ఫ్లాట్ ఫామ్ మీద పడుకునే వాడినని వివరించారు. నేను షూటింగ్ లోనే ప్రొడక్షన్ వాళ్లు పెట్టేది తిని బతికానని సినిమా మధ్యలో రోజువారీ ఖర్చులకు కార్లు కడిగి నెలంతా వంద రూపాయలు సంపాదించి కడుపునింపుకునేవాడినని తెలిపారు. ఇప్పటికీ చెన్నై వెళ్లినప్పుడు తాను ఫ్లాట్ ఫామ్ మీద, రోడ్డు పక్కన నిద్రపోయిన ప్రదేశాలకు వెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నానని తేజ వివరించాడు.