జగన్ ప్రత్యేక హోదా సాదించగలరా?…స్పెషల్ ఎనాలిసిస్
గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే కాదు ప్రస్తుతం వైసిపి ప్రభుత్వంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ అయింది. రాజకీయాలను కుదిపేస్తోంది. అసలు హోదా అనేది కేంద్రంలోని బిజెపి సర్కార్ ఇస్తుందా, జగన్ కి సాధించే సత్తా ఉందా లేదా అనే అంశాలపై జోరుగా చర్చ నడుస్తోంది. అన్ని చానల్స్ లో కూడా దీనిపై చర్చ నడుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ మాట ఇచ్చింది. అప్పుడు విపక్షంగా ఉన్న బిజెపి హోదాకోసం పట్టుబడుతూ మద్దతిచ్చింది.
అయితే 2014లో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేంద్రంలో కూడా ఓటమి పాలయింది. అయితే అప్పట్లో అధికారంలోకి వచ్చిన బిజెపి హోదా బదులు ప్యాకేజి ఇస్తామని చెప్పింది. ఇక రెండో సారి కూడా మోడీ అధికారంలోకి వచ్చారు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్ లో స్పెషల్ స్టేటస్ గురించి సీఎం జగన్ మాట్లాడారు. హోదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని,హోదా ప్రాణవాయువుతో సమానమని కూడా జగన్ చెప్పుకొచ్చారు. మోడీకి సన్నిహితుడని చెప్పుకుంటున్న జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే జగన్ తో మోడీకి సత్సబంధాలు ఉన్నందున హోదా ఇస్తారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే, నీతి ఆయోగ్ మీటింగ్ లో హోదా వస్తే ఏపీకి పెట్టుబడులు , పరిశ్రమలు వస్తాయని , ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మోడీకి జగన్ వివరించారు. పునర్విభజన చట్టంలో హోదా విషయం ఉందని, ఇక చట్టపరంగా అడ్డంకులు కూడా ఉండవని అన్నారు. విభజన నాటికి 97వేలకోట్లున్న ఎపి అప్పు ప్రస్తుతం 2కోట్ల 59వేలకోట్లకు చేరిందని, హోదా ఒక్కటే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుతుందని వివరించారు.
ఇక ఆర్ధిక సంఘం కూడా హోదా కు వ్యతిరేకం గా ఎలాంటి సిఫార్సులు చేయలేదని కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖను నీతి ఆయోగ్ ముందు ఉంచారు. ప్రజల మనోభావాలను వివరించారు. 2014ఎన్నికల సమయంలో బిజెపి కూడా హామీ ఇచ్చిందని గుర్తుచేసారు. మరి ప్రధాని ఏపీకి హోదా ఇస్తారా ఇంకా నానుస్తారా అనేది చూడాలి.