బిగ్ బాస్ ఆపేయాలి.. కోర్టులో పోరాటం?!
బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటోందా అంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హోస్ట్ గా, తమిళనాట కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ కొత్త సీజన్లను ఘనంగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒక ప్రాంతంలోని సంస్కృతి- సాంప్రదాయాల్ని నాశనం చేసే విధంగా టీవీ కార్యక్రమాలు ఉంటే సంప్రదాయ వాదుల నుంచి వ్యతిరేకత రావడం ఖాయం. కచ్ఛితంగా ఎవరో ఒకరు ఎదురెళ్లి, చివరకు కోర్టుల్లో పోరాటం చేయడానికి కూడా వెనుకాడరు. మన సంప్రదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాదు.. కల్చర్ మంటగలిసిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునేందుకు కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు.
టీఆర్ పీ ఆట ఆడి డబ్బు సంపాదించుకునేందుకు కోట్లాది మంది జనజీవనాన్ని అతలాకుతలం చేసే కార్యక్రమాల్ని టీవీ చానెళ్లు లైవ్ చేస్తామంటే అస్సలు ఒప్పుకోరు. సర్వం కమర్షియల్ మయం అయిపోయిన కార్పొరెట్ జంగిల్ అంతం చూసేందుకు పోరాడేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఇక పాశ్చాత్య పోకడలతో బిగ్ బాస్ టీవీ రియాలిటీ షో భారతదేశం లో విధ్వంసం చేస్తోందన్న విమర్శలు ఎక్కువగా ఉంటున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా బిగ్ బాస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కామన్ జనం ఎంతగా ఆదరించినా .. అందులో ఉన్న చెడును తీసుకుని యువతరం- పిల్లలు తప్పు దారి పడితే ఆ ప్రభావం వ్యవస్థ మీద పడుతుందన్న ఆందోళన బిగ్ బాస్ విషయంలో తీవ్రంగానే ఉంది. ఇది పైకి కనిపించని విస్పోటనం లాంటిది. అందుకే తమిళ నాడులో ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఆపేయాలంటూ హై కోర్టులో పిటిషన్ పడింది. కమల్ హాసన్ హోస్ట్ గా సీజన్ 3 ప్రారంభానికి రెడీ అవుతున్న వేళ ఇదో బిగ్ పంచ్ అని విశ్లేషిస్తున్నారు. . “బిగ్ బాస్ మన కల్చర్ ని నాశనం చేస్తోంది.. పొట్టి దుస్తులతో పిల్లల్ని తప్పు దారి పట్టిస్తోంది. యువతరం చెడు దారిలో వెళ్లేందుకే ఆస్కారం కనిపిస్తోంది“ అంటూ పిటిషనర్ వాదించనున్నారు.ఇక ఈ వివాదం స్ఫూర్తితో ఇటు తెలుగు బిగ్ బాస్ కి ఇలాంటి వ్యతిరేకత ముప్పు పొంచి ఉందా?
అన్న విషయం పై యువతరంలో జోరుగా నడుస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా స్టార్ మాలో ఈ కార్యక్రమం లైవ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎంపిక పూర్తిచేసినట్లు వార్తలొస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ విషయంలో సాంప్రదాయ వాదుల ఆలోచన ఎలా ఉందొ అనేది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. తమిళనాట కోర్టుకి వెళ్లిన నేపథ్యంలో మునుముందు తెలుగులో కూడా అసలేం జరగబోతోంది? అన్న చర్చా సాగుతోంది. బిగ్ బాస్ – తెలుగు కూడా ఇప్పటికే కల్చర్ ని నాశనం చేస్తోందని సంప్రదాయ వాదుల్లో ఆందోళన ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మహిళా మండళ్ల లో నిరంతర చర్చ సాగుతూనే ఉంది. అయితే తమిళ తంబీల్లా ఇక్కడ రాద్ధాంతం తక్కువ అని అంటున్నారు. చూద్దాం ఏమి జరుగుతుందో.