కార్గిల్ యుద్దానికి రంగం ముందే సిద్ధం అయిందా? నిజం ఎంత?
1971 లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణలు తక్కువే అయినా సియాచెన్ హిమానీనదము మీద పట్టు సాధించటానికి ఇరు దేశాలు చుట్టు పక్కల ఉన్న కొండల మీద సైనిక స్ధావరాలను ఏర్పాటు చేస్తుండటంతో ఘర్షణలు పెరిగాయి.1990లలో కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదం మరియు అణు ప్రయోగాల వల్ల ఉద్రిక్త పరిస్తుతులు నెలకొన్నాయి. వీటిని తగ్గించుకోడానికి ఇరు దేశాలు కాశ్మీర్ సమస్యని కేవలం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని లాహోర్ లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి “ఆపరేషన్ బద్ర్” అని గుప్త నామం. దీని లక్ష్యం కాశ్మీర్ మరియు లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం మరియు భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం.
భారత సైన్యాధిపతి వేద్ ప్రకాష్ మాలిక్ మరియు ఎందరో ఇతర పండితుల ప్రకారం, ఈ కార్యక్రమానికి పాకిస్తానీయులు చాలాకాలం క్రితమే రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ యుద్ధ తీవ్రతకి భయపడి పాకిస్తాన్ నాయకులు వెనక్కి తగ్గారు.1998 లో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్ళీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. యుద్ధానంతరం పాక్ ప్రధాని, నవాజ్ షరీఫ్, ఈ విషయాలేవీ తనకు తెలియవని, భారత ప్రధాని వాజపాయ్ చేసిన ఫోన్ ద్వారానే ఈ విషయాలు తెలిసాయని తెలిపాడు ఈ పథకం మొత్తం ముషారఫ్ మరియు అతని సన్నిహిత సైనికాధికారులు కలిసి చేశారని షరీఫ్ మరియు చాలా మంది పాక్ రచయితలు చెప్పారు.. కాని ముషారఫ్ ఈ పథకాన్ని, లాహోర్ ఒప్పందానికి 15 రోజుల ముందే షరీఫ్ కు తెలియపరిచానని చెప్పాడు.